మరో 18 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరానికి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ సారి విశ్వవిజేతగా నిలవడం కోసం మెగాటోర్నీలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టింది.
ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్వదేశానికి తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే బట్లర్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, టోప్లే ఐపీఎల్-2024కు గుడ్‌బై చెప్పి భారత్‌ను వీడారు. మరికొన్ని రోజుల్లో సామ్ కరన్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ కూడా ఇంగ్లండ్ జట్టుతో చేరుతున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల మధ్య ఐక్యత, జట్టు కూర్పును సిద్ధం చేయడానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్లేయర్లందరినీ ఓ దగ్గరికి చేర్చుతుంది.

అంతేగాక ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టుతోనే పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ టీ20 సిరీస్ ఆడనుంది. మెగా సమరానికి ఇంగ్లండ్ జట్టుకు ఇది సన్నాహకంగా ఉపయోగపడుతుంది. కానీ టీమిండియా పరిస్థితి భిన్నంగా ఉంది. భారత ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిన రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఐపీఎల్‌లో భిన్నమైన జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే బుమ్రా, సిరాజ్ విడివిడిగా కొత్త బంతిని అందుకుంటున్నారు.
ఐపీఎల్ కారణంగా వరల్డ్ కప్‌కు ఉమ్మడిగా భారత జట్టు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం లేదు. ఇది టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్‌తో ఆటగాళ్లకు విరామం లేకుండా షెడ్యూల్ చేసిన బీసీసీఐని భజ్జీ పరోక్షంగా విమర్శించాడు. అలాగే మెగాటోర్నీకి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఎక్కువగా నిర్వహించేలా బీసీసీఐ చొరవ తీసుకోవాలని కోరాడు.
''ఈ ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లందరూ కలిసి ఉమ్మడిగా మ్యాచ్‌లు ఆడలేకపోతున్నారు. ప్రపంచకప్‌కు ముందు అమెరికాలో టీమిండియా కేవలం రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లే ఆడనుంది. కానీ కనీసం నాలుగు నుంచి అయిదు మ్యాచ్‌లు ఆడితే టీమిండియాకు కలిసొస్తుంది''
''అమెరికాలోని పరిస్థితులకు అలవాటు పడేలా అగ్రశ్రేణి జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో ఆడితే జట్టులోని ఆటగాళ్లంతా కలిసి ఆడితే భారత్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అది జరిగేలా లేదు. అయితే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ వంటి టోర్నీల ముందు కనీసం 10-15 రోజుల ముందు నుంచి భారత ఆటగాళ్లంతా కలిసి ఉండటం ఎంతో ముఖ్యం'' అని హర్భజన్ సింగ్ అన్నాడు.