హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఇక, రెండు జట్లు మైదానంలోకి దిగాయంటే సహజంగానే ఉద్రిక్తతలు నెలకొంటాయి. అయితే మైదానం బయట పరిస్థితి మరోలా ఉంటుంది. అటగాళ్లు మాత్రం స్నేహభావాన్ని ప్రదర్శిస్తుంటారు.
తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ మంచి పని కోసం టీమిండియా వెనటర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేతులు కలిపారు. అఫ్రిదికి చెందిన హోప్ నాటౌట్ పేరుతో వీళ్లు ఓ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ ఫౌండేషన్ కోసం వీరు విరాళాలు సేకరించనున్నారు.

2014లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్ పాక్‌లోని పేద పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు క్రీడా వసతులు కల్పించడం కోసం కృషి చేస్తోంది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆసుపత్రులు నిర్మించడంతోపాటు నీటి కోసం బావులు, బోర్లు సైతం వేయించింది.
తాజాగా అఫ్రిది పౌండేషన్ కోసం విరాళాలు సేకరించేందుకు గాను హర్భజన్ చేతులు కలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇద్దరు క్రికెటర్లు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో అభిమానులతో పంచుకున్నారు.