న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానిని తన పెళ్లికి ఆహ్వానించారు. తన వివాహ పత్రికను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు మాట్లాడారు. ఇందుకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది.

హర్భజన్ సింగ్ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి గీతా బస్రాను ఈ నెల పెళ్లి చేసుకుంటున్నాడు. వారి వివాహం ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో జరగనుంది. అక్టోబర్ 29న హర్భజన్, బస్సా పంజాబ్‌లోని జలంధర్‌లో వివాహం చేసుకోనున్నారు.
మొత్తం ఐదురోజులపాటు ఈ వివాహ తంతు జరగనుంది. నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గీత బస్రా లండన్‌లో ఉండగా.. ముంబైలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను డిజైన్ చేసి అక్కడికే పంపిస్తున్నట్లు తెలిసింది.

హర్భజన్‌కి కూడా అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖరారు చేశారని తెలుస్తోంది. భజ్జీ వివాహ వేడుకకు టీమిండియా ఆటగాళ్లతోపాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు.