
ముంబై: ఖలిస్తాన్ తీవ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఓ మెట్టు దిగొచ్చిన టర్బోనేటర్.. అభిమానులకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసింది వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, చూడకుండా ఆ పోస్టు పెట్టానని వివరణ ఇచ్చాడు. అంతర్జాతీయ కెరీర్‌లో హర్భజన్ 103 టెస్టుల్లో, 236 వన్డేల్లో, 28 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
'ఆపరేషన్ బ్లూస్టార్'కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ హర్భజన్ సింగ్ జూన్ 6న ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్‌వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ.. హర్భజన్‌ను చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అభిమానులు, నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విషయం తెలుకున్న టర్బోనేటర్.. పొరపాటును గుర్తించానని ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు.
'ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసిన పోస్టుకి క్షమాపణలు చెబుతున్నా. అది వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్‌ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును, భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా' అని హర్భజన్ సింగ్ సోమవారం ట్వీట్ చేశాడు.
హర్భజన్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పినా.. నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. 'ఫార్వర్డ్ మెసేజ్ అయితే చదవకుండా ఎలా పెడతావ్', 'టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన నువ్.. ఎంతో బాధ్యతగా ఉండాలి' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'గతంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడు' అంటూ ఇంకొందరు విరుచుకుపడుతున్నారు. దీంతో హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.