
హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ నమోదు చేశాడు. తద్వారా అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. భారత పర్యటనలో అంతగా అనుభవం లేని వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
పృథ్వీ షా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. భారత తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన నాలుగో అతి చిన్న వయసు బ్యాట్స్‌మన్. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్. సచిన్ (17 ఏళ్ల 112 రోజులు) తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన ఏడో అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్.
అంతేకాదు తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్. గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన పృథ్వీ షా... ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా పృథ్వీ షాకు క్రికెట్ అభిమానులతో పాటుగా దిగ్గజాలు సైతం తమ సంతోషాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్‌లు మరింత రాణించాలని ఆశిస్తూ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్‌ను పోస్టు చేశారు.