ముంబై: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా స్టార్ స్పోర్ట్స్‌తో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "గేల్ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. అతడికి నేను పెద్ద ఫ్యాన్‌ని అతనొక మంచి ఎంటర్టైనర్." అని అన్నారు. గేల్ అద్భుతం చేశాడు. వరల్డ్ కప్‌ను మిస్ కాకుడదనే వారి కోసం ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎంతైనా అవసరమని తెలిపారు.
గేల్ ఫామ్‌లోకి రావడం తనతో పాటు తన జట్టుకి కూడా ఎంతో మేలు కలిగించే అంశమని పేర్కొన్నారు. టోర్నమెంట్లో తొలి మ్యాచ్‌లో గేల్ చెత్త ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోలేని విధంగా ఉందన్నారు. జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ గేమ్ తుఫాన్‌ని సృష్టించారని, జింబాబ్వే బౌలర్లను మైదానం అన్ని వైపులా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇరగదీశారన్నారు.

టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌ల్లోనే క్రిస్ గేల్ డబుల్ సెంచరీ రికార్డుని సాధించడం సంతోషమన్నారు. క్రిస్ గేల్‌తో పాటు వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన మిగతా ఆటగాళ్లు భారతీయలే కావడం విశేషం. ఒక ఇన్నింగ్స్‌లో 16 సిక్స్‌లు కొట్టి రోహిత్ శర్మ, ఏబీ డెవిలియర్స్ రికార్డలను కూడా సమం చేశాడన్నారు.
క్రిస్ గేల్ సెంచరీతో వెస్టిండిస్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. మూడవ మ్యాచ్‌లోనే గేల్ ఫామ్‌లోకి రావడం మిగతా జట్లకు కూడా ఇది ప్రమాదకరమన్నారు. దీంతో మిగతా జట్లు వెస్టిండిస్ జట్టుతో పాటు గేల్ పై కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.
మంగళవారం కాన్‌బెర్రాలోని మనుక ఓవల్ మైదానంలో క్రిస్ గేల్ వరల్డ్ కప్‌లోనే అత్యధిక స్కోరు 215 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేవలం 2 వికెట్లను కొల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 372 పరుగులు వెస్టిండిస్ చేసింది. 147 బంతుల్లో క్రిస్ గేల్ 10 ఫోర్లు, 16 సిక్స్‌లు కొట్టాడు.