హైదరాబాద్: ఆస్ట్రేలియన్లకు నైట్‌మేర్, భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సృష్టించుకున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాదు ట్విట్టర్ వేదికగా లక్ష్మణ్‌పై తమకున్న అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ సొగసరి బ్యాట్స్‌మెన్... ఆస్ట్రేలియాతో కోల్ కత్తాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సృష్టించిన పరుగుల సునామీ (281)ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
'లక్ష్మణ్ ఓ అద్భుతమైన క్రీడాకారుడు. దేశానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించే వ్యక్తి' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో కొనియాడారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ ఇండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే సహా పలువురు ఆటగాళ్లు లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

వీవీఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్ అని అంటుంటేవారు క్రీడా విశ్లేషకులు. ప్రపంచ క్రికెట్‌కు మణికట్టు మంత్రజాలాన్ని పరిచయం చేసిన అత్యుత్తమ క్రికెటర్లలో వీవీఎస్ ఒకరు. ఆన్‌డ్రైవ్, ఆఫ్‌డ్రైవ్, కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, పుల్, బ్యాక్‌ఫుట్ పంచ్, కాలి బొటనవేళ్లపై నిలబడి చేసే సొగసైన ఫ్లిక్‌షాట్ల అతని బ్యాట్ నుంచి జాలువారినవే.
ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లయితే అచ్చం డాన్ బ్రాడ్‌మన్‌లా ఆడుతున్నాడే, ఎక్కడ బంతి వేసినా బౌండరీకి తరలిస్తున్నాడంటూ జోకులు వేసుకున్న సందర్భాలు అనేకం. ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసించే రోజుల్లో ఆసీస్ జట్టులో బౌలర్లంతా లక్ష్మణ్‌కు ఎలా బౌలింగ్ చేయాలా? అని ఆలోచించేలా చేశాడు.
గంటల కొద్దీ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడడం లక్ష్మణ్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా జట్టుపై కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లక్ష్మమ్ సాధించిన 281 పరుగుల ఇన్నింగ్స్ గత యాభై ఏళ్లలో నమోదైన అత్యుత్తమ టెస్టు ప్రదర్శనగా క్రికెట్ నిపుణులు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన లక్ష్మణ్ ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ కామెంటేటర్‌గా అలరిస్తున్నాడు.
ఇటీవలే హైదరాబాద్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. దీంతో పాటు తన భార్య శైలజ బంజారా హిల్స్‌లో 'ఫస్ట్ ఇన్నింగ్స్' అనే ప్లేస్కూల్ ప్రారంభించారు. ఈ రెండిటికీ తన సేవలు అందిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా ఉన్నారు.