
ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా:
2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో ఆడాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీచేశాడు. మొదటిలో కీపింగ్‌లో పెద్దగా ఆకట్టుకొని పంత్.. ఇపుడు ఔరా అనిపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ చేసి జట్టుకు ఊహించని విజయాలను అందిస్తున్నాడు. రిషబ్ పంత్ ఇప్పటివరకు భారత్ తరఫున 25 టెస్టులు (1549 రన్స్), 18 వన్డేలు (529 రన్స్), 33 టీ20 (512 పరుగులు)లు ఆడాడు. టెస్టుల్లో మూడు శతకాలు అందుకున్నాడు. ఇక 80 ఐపీఎల్ మ్యాచులలో 2416 పరుగులు చేశాడు.

అద్భుతంగా రాణిస్తోన్న ఢిల్లీ:
ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు గాయం అవడంతో రిషబ్ పంత్ జట్టు సారధ్య బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నాడు. అతని సారధ్యంలో జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో సమానంగా ఢిల్లీ పాయింట్లు సాధించింది. పంత్ సారధ్యంలోని ఢిల్లీ జట్టు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నైతో తలపడనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పంత్‌పై బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చెన్నైపై విజయంతో ఈ పుట్టినరోజును మర్చిపోలేని అనుభూతిగా మార్చుకోవాలని ఆశిస్తూ ఢిల్లీ ట్వీట్ చేసింది.

స్విమ్మింగ్ పూల్‌లో పడేశాడు:
పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని పలువురు ఆటగాళ్లు రిషబ్ పంత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఢిల్లీ పేసర్ ఆవేశ్ ఖాన్ మాట్లాడుతూ... 'గతేడాది రిషబ్ పంత్.. నా చెప్పులను స్విమ్మింగ్ పూల్‌లో పడేశాడు. అలా నన్ను ఆటపట్టించాడు. ఆటతో పాటు కెప్టెన్సీని కూడా ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటాడు. మానసికంగానూ చాలా ఆహ్లాదంగా ఉంటూ.. తోటి ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. నేను పొరపాట్లు చేసిన సమయంలో అండగా ఉన్నాడు. నేను బాగా బౌలింగ్ చేసినప్పుడు అభినందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు' అని అన్నాడు.

ఒకటి చెప్తాడు.. మరొకటి చేస్తాడు:
'రిషబ్ పంత్ ఒకటి చెప్తాడు.. మరొకటి చేస్తాడు. అతడికి ప్రణాళికలు ఏంటో ఎవ్వరికి అర్థం కావు. పంత్ గురించి చెప్పడానికి ఒక మంచి సంఘటన నాకు ఇప్పుడు గుర్తుకురావడం లేదు. కానీ అతడి గురించి ఆలోచించినట్లైతే మాత్రం ఒక పుస్తకం రాయొచ్చు' అని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. 'రూమ్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఉంటే.. నలుగురికి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. అంత ఎవరు తింటారు అని అడిగితే.. నేనే అని చెపుతాడు. ఈ విషయంలో తరచుగా గొడవ పడుతుంటా. నేను తిట్టినా తింటూనే ఉంటాడు. ఇలాంటి సరదా ఘటనలు మా ఇద్దరి మధ్య చాలానే ఉన్నాయి. అయితే పంత్ ఒకసారి చేసిన పనిని మళ్లీ మళ్లీ చేయడు. అది అతడిలోని మంచి పద్ధతి. దేనిపై వ్యసనం పెంచుకోడు' అని అక్షర్ పటేల్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












