
పవర్ హిట్టింగ్‌తో వెలుగులోకి:
జులై 7, 1981లో ఝార్ఖండ్‌లోని రాంచీలో జన్మించిన ఎంఎస్ ధోనీ.. దేశవాళీ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో వెలుగులోకి వచ్చాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే మొదటి మ్యాచ్‌లో తొలి బంతికే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత 3-4 ఇన్నింగ్స్‌ల పాటు పరుగులు చేయలేకపోయిన మహీకి.. 2005లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగి 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసి టీమిండియా తరపున వికెట్ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత అతడు ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ద్రవిడ్ నుంచి నాయకత్వ బాధ్యతలు:
2007లో తొలి టీ20 ప్రపంచకప్‌కు ముందు ఎవరు ఊహించని విధంగా రాహుల్ ద్రవిడ్ నుంచి భారత జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు ఉన్నా.. దిగ్గజాల సలహాల కారణంగా మహీపైనే బీసీసీఐ నమ్మకముంచింది. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత యువ జట్టును ముందుండి నడిపించాడు. ఏమాత్రం ఆశల్లేని జట్టుతో బరిలోకి దిగినా.. తన కూల్ కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చాడు. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై గెలుపొంది టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక్కడి నుంచి ధోని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 2008, 2009లో వరుసగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అప్పటివరకు వరుసగా రెండుసార్లు ఐసీసీ అవార్డును అందుకున్న ఆటగాడు ధోనీనే కావడం విశేషం.

ఏకైక కెప్టెన్‌గా:
అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ 2009లో టీమిండియాను టెస్టుల్లో అగ్రస్థానానికి తీసుకొచ్చాడు ఎంఎస్ ధోనీ. అప్పటికే భారత విజయవంతమైన కెప్టెన్‌గా ముద్రపడిన మహీ.. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 79 బంతుల్లో 91 పరుగులు చేసి ఒంటిచేత్తో కప్‌ను అందించాడు. ఇక మ్యాచ్‌లో విన్నింగ్ షాట్‌గా కొట్టిన సిక్సర్ క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆంటే తెలియని వారికి కూడా ధోనీ పేరు తెలిసొచ్చింది. ఇటీవలే గూగుల్ కూడా ఆ సిక్సర్‌కి గుర్తింపు ఇచ్చింది. 2013లో క్రికెట్ చరిత్రలో అప్పటివరకు ఎవరు సాధించని రికార్డును మహీ అందుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలవడం ద్వారా క్రికెట్ చరిత్రలో అప్పటివరకు ఉన్న ఐసీసీ ట్రోపీలను సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.

2020 ఆగస్టు 15న రిటైర్మెంట్:
2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన మహీ.. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2-3 సంవత్సరాలు విరాట్ కోహ్లీకి అండగా ఉంటూ.. బ్యాట్స్‌మన్, కీపర్‌గా కొనసాగాడు. ఈ సమయంలో మహీ బ్యాటింగ్‌లో కంటే కీపింగ్‌లోనే ఎక్కువగా మెరిశాడు. రెప్పపాటులో స్టంపింగ్స్, వికెట్లను చూడకుండానే రనౌట్లు చేశాడు. ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్ కూడా 'ఎంఎస్ ధోనీ రివ్యూ సిస్టమ్'గా మార్చేశాడు. 2019 ప్రపంచకప్‌లో రనౌట్‌గా వెనుదిరగడంతో మొదటిసారి మహీ రిటైర్మెంట్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. యాదృశ్చికంగా ధోనికి అదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉన్న అతడు 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు.

స్నేహం కాస్త ప్రేమగా:
ఎంఎస్ ధోనీ, సాక్షి సింగ్ తండ్రులు ఒకేచోట కలిసి పనిచేసేవారు. దాంతో ధోనీ-సాక్షి కూడా ఒకేచోట కలిసి చదువుకున్నారు. సాక్షికి మహీ సీనియర్ అయినా.. మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత సాక్షి తండ్రికి ఉద్యోగం మారడంతో.. వారు వేరే చోటుకు వెళ్లిపోయారు. దీంతో వీరు చాలాకాలం దూరంగానే ఉన్నారు. 2007లో అనుకోకుండా ఓ కామన్ స్నేహితుడి ద్వారా వీరిద్దరు మళ్లీ కలుసుకున్నారు. ఆ సమయంలో సాక్షి ఓ హోటల్లో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఓ రోజు మ్యాచ్‌లో భాగంగా అదే హోటల్లో బసకు దిగారు భారత ఆటగాళ్లు. అయితే సాక్షికి తెలియకుండా ఆ హోటల్ మేనేజర్ దగ్గర నుంచి ఆమె ఫోన్ నెంబరు తీసుకుని తనకు మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు ధోనీ. అలా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆపై 2010లో జులై 4న పెళ్లి చేసుకున్నారు.

మహీ నామస్మరణంతో ఊగిపోతున్న సోషల్ మీడియా:
అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు. 16 ఏళ్ల కెరీర్‌లో అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మహీ.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం. ధోనీకి మాజీలు, సహచరులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు మహీ నామస్మరణంతో ఊగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications












