హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) మధ్య తలెత్తిన జీతాల గొడవ తారాస్థాయికి చేరుకుంది. ప్రతిపాదిత నూతన ఆదాయ పంపిణీ విధానం గురించి చర్చించేందుకు ఆటగాళ్లకు సీఏ నిర్దేశించిన గడువు జూన్ 30(శనివారం)తో ముగిసింది.
అటు బోర్డు, ఇటు క్రికెటర్లు ఎవ్వరూ పంతం వీడలేదు. జీతభత్యాల వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడింది. బోర్డుతో ప్రస్తుతం ఉన్న ఒప్పందం శనివారంతో ముగియంతో ఆసీస్‌కు చెందిన 230 మంది క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే కొత్త కాంట్రాక్ట్‌పై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న 230 మంది పురుష, మహిళా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు.
ఏడాదికి మించి ఒప్పందం కలిగిన ఆటగాళ్లు మాత్రమే ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు అర్హులు. దీంతో బోర్డు, ఆటగాళ్ల మధ్య నెలకొన్న ఈ జీతాల గొడవ ఎంతకీ ఓ దరికి రాకపోవడంతో పలువురు క్రికెటర్లు కొత్త ఉద్యోగాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తనకు ఉద్యోగం వచ్చిందని ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంగ్లాండ్ టీ20ల్లో భాగంగా సర్రే తరపున బరిలోకి దిగుతున్నట్లు ఆరోన్ ఫించ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు పాస్ పోర్టుని, తన విమాన టికెట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి 'మళ్లీ కలుద్దాం. లండన్‌కు వెళుతున్నా. నేను ఉద్యోగిని అయినందుకు సంతోషంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చింది 'అని ఫించ్ క్యాప్షన్ పెట్టాడు.
జీతాల విషయంలో ఎందుకీ గొడవ?
ప్రస్తుత జీతాల ఒప్పందం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) క్రికెట్ ఆదాయంలో 25 శాతాన్ని క్రికెటర్లకు పంచుతోంది. ఈ విధానానికి మార్పుచేర్పులు చేసి వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరుగా జీతభత్యాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. ఆదాయ మిగులులో కొంతభాగాన్ని సీనియర్, జూనియర్ క్రికెటర్లకు పంచి.. పురుష, మహిళా క్రికెటర్ల జీతాలను పెంచాలన్నది సీఏ ఆలోచన. ఇందుకు క్రికెటర్లు ఒప్పుకోవాలంటూ హెచ్చరించింది. అందుకు జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. అయితే ఈ కొత్త ప్రతిపాదనకు ఆసీస్ క్రికెటర్లు అంగీకరించకపోవడంతో ఆసీస్ క్రికెట్ సందిగ్ధంలో పడింది.