
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కోనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన తెలుగు కుర్రాడు హనుమ విహారీ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో విహారీ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓ అజేయ సెంచరీ, హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా చివరి మూడు మ్యాచ్‌ల్లో హనుమ విహారీ వరుసగా 16 బంతుల్లోనే 45 పరుగులు, 43 బంతుల్లోనే 112* పరుగులు, 23 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు.
అంటే ఈ 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి విహారీ 216 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. కాగా ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో హనుమ విహారీ 50 లక్షల రూపాయల కనీస ధరతో వేలంలోకి దిగాడు. అయితే దురదృష్టవశాత్తూ టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ అయినా హనుమ విహారీని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.
దీంతో చేసేదేమి లేక బీసీసీఐ పర్మిషన్ తీసుకుని బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో చోటు దక్కలేదనే నిరాశనో ఏమో కానీ అక్కడ చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టెస్టు స్పెషలిస్ట్ అని తనపై పడ్డ ముద్రను కూడా ఈ టోర్నీతో చెరిపేసుకుంటున్నాడు. అచ్చమైన టీ20 క్రికెటర్‌లా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో సెంచరీలు, హాఫ్ సెంచరీలు సునాయసంగా బాదేస్తున్నాడు. మొత్తంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనైనా ఏదో ఒక జట్టులో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఢాకా ప్రీమియర్ లీగ్‌లో హనుమ విహారీ చెలరేగుతున్నట్టుగా అర్థమవుతుంది.
అయితే ఢాకా ప్రీమియర్ లీగ్‌లో హనుమ విహారీ ఆట చూసిన అభిమానులు సన్‌రైజర్స్ టీంలోకి విహారీని కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయడపడుతున్నారు. అందుకే వచ్చే సారైనా తెలుగు ఆటగాళ్లను సన్‌రైజర్స్ టీం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరైదే కచ్చితంగా హనుమ విహారీని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన హనుమ విహారీ 14 సగటుతో 284 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 46 పరుగులుగా ఉంది. ఒక వికెట్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత జట్టు తరఫున 15 టెస్టు మ్యాచ్‌లాడిన 28 ఏళ్ల హనుమ విహారీ 35 సగటుతో 808 పరుగులు చేశాడు.