
ఆదిలోనే భారీ షాక్:
న్యూజిలాండ్ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్‌ను పృథ్వీ షా-మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించగా ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జట్టు ఖాతా తెరవకుండానే పృథ్వీ షా డకౌట్ కాగా.. జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద మయాంక్ ఒక్క పరుగు చేసి పెవియన్ చేరాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ఖాతా తెరవకముందే పెవిలియన్ బాట పట్టాడు.

ఆదుకున్న పుజారా:
భారత్ 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో ఫస్ట్ డౌన్‌లో వచ్చిన నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే అజింక్య రహానే (18) త్వరగానే పెవిలియన్ చేరడంతో 38 పరుగుల వద్ద భారత్ మరో వికెట్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తాను క్రీజులోకి రాకుండా కుర్రాళ్లను పంపాడు. పుజారాకు హనుమ విహారి జత కలవడంతో భారత ఇన్నింగ్స్ గాడిలో పడింది. ఇద్దరూ కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీలు చేసారు. దీంతో భారత్ కోలుకుంది.

విహారి సెంచరీ:
పుజారా, విహారి జోడి ఐదో వికెట్‌కు 193 పరుగులు చేసారు. సెంచరీకి ముందు పుజారా ఔట్ కాగా.. కాసేపటికి విహారి సెంచరీ సాధించాడు. అయితే విహారి శతకం సాధించిన తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. రిషభ్ పంత్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యాడు. ఆపై వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్‌లు డకౌట్ అయ్యారు. ఉమేష్ యాదవ్ (9) నిలబడినా.. రవీంద్ర జడేజా (8) ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. వెంటనే తొలి రోజు ఆట ముగిసినట్టు అంపర్లు ప్రకటించారు. కుగ్లీజిన్, ఇష్ సోథీలు తలో మూడు వికెట్లు సాధించగా.. గిబ్సన్ రెండు, నీషమ్‌కు ఒక వికెట్ దక్కింది.

ఓపెనర్లుగా ఎవరు?
గాయంతో రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో.. మయాంక్‌కు జతగా మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇటీవల మయాంక్ ఏమంత ఫామ్‌లో లేడు. 'భారత్ ఎ' జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. సన్నాహక మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేదు. మరోవైపు పృథ్వీ షా వన్డే సిరీస్‌లో ఫర్వాలేదనిపించినా.. భారీ స్కోరు సాధించేలేకపోయాడు. మరోవైపు 'భారత్-ఎ' మ్యాచ్‌లలో గిల్ అద్భుతంగా రాణించాడు. తాజా ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ముగ్గురి ఫామ్ ఇప్పుడు టీమిండియాను కలవరపెడుతోంది.


Click it and Unblock the Notifications












