హైదరాబాద్: ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బ్రావో బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) టీ20 లీగ్‌కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో దూరమయ్యాడు. ఈ లీగ్‌లో బ్రావో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే.
గురువారం రాత్రి పెర్త్ స్కార్చర్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫోర్ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా బ్రావో తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నడవడానికే ఇబ్బంది పడటంతో ఫిజియోలు బ్రావోను స్ట్రెచర్‌పై స్టేడియం నుంచి బయటికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఆసుపత్రిలో స్కానింగ్ తీయగా డాక్టర్లు ఆపరేషన్ అవసరమని సూచించడంతో బ్రావో బీబీఎల్ నుంచి తప్పుకున్నాడు. సర్జరీ అవసరమైందని, త్వరగా కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తానని బ్రావో బీబీఎల్ సైట్ ద్వారా విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.
సర్జరీ కారణంగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బ్రావో పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ టీ20 లీగ్‌లో బ్రావోను లాహోర్ కలందర్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బ్రావో గాయంపై మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ మాట్లాడాడు.
బ్రావో జట్టుకు దూరమవ్వడంతో తమ జట్టుపై ఎంతో కొంత ప్రభావం ఉంటుందని తెలిపాడు. ఇది తమ జట్టుకు తీరని లోటని, ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో బ్రావో ఒకడని ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. ఇక బీబీఎల్ పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు.
అడిలైడ్ స్ట్రయికర్స్ తరుపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ సైతం గాయపడ్డాడు. వైద్యులు రిచర్డ్‌సన్‌కు నెల రోజుల పాటు విశ్రాంతి సూచించారు. అతని స్ధానంలో జట్టులోకి ఎడమ చేతి వాటం స్ఫిన్నర్ టామ్ ఆండ్రూస్‌కు చోటు లభించింది.