
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది స్మిత్, వార్నర్‌ల టాంపరింగ్ వివాదం. అయితే దీని ప్రభావం క్రమంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై కూడా పడింది. ఫలితంగా వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి నిషేదించింది. ఈ వార్త తెలియగానే సన్‌రైజర్స్ జట్టుతో పాటు, అభిమానులు సైతం షాక్‌కు గురైయ్యారు. దీంతో వార్నర్ లేని లోటు పూడ్చటం కోసం ఫ్రాంచైజీ అనేక రకాలుగా ప్రయత్నించింది.
గతేడాది వరకూ సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారం మొత్తాన్ని డేవిడ్ వార్నర్ మోసేవాడు. అతడికి ధావన్ అండగా నిలిచేవాడు. ఈ క్రమంలోనే ధావన్‌కు జతగా సాహా, భుయ్, విలియమ్సన్ ఓపెనింగ్ చేసినా ఆకట్టుకోలేకపోయారు. కానీ శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 163 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఉప్పల్ స్టేడియంలో 2014 నుంచి ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద లక్ష్య చేధన కావడం విశేషం.
ఇంగ్లిష్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఢిల్లీపై వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లోనే 45 పరుగులతో ధాటిగా బ్యాటింగ్ చేసి లక్ష్య చేధనలో శుభారంభం ఇచ్చాడు. ఆవేశ్ ఖాన్ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన హేల్స్ ఆ ఓవర్లో 27 పరుగులు రాబట్టాడు. తర్వాత అతడు ఔటైనా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించడం, చివర్లో యూసుఫ్ పఠాన్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ గెలిచింది. సోమవారం రాత్రి బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో హేల్స్ రాణిస్తే.. అప్పుడు ఓ నిర్ధారణకు రావచ్చు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఫలితంగా 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సన్‌రైజర్స్ విజయాల క్రెడిట్ ప్రధానంగా బౌలర్లకే దక్కుతుంది. ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తూ.. జట్టు విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి నుంచి హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనమే.