
హైదరాబాద్: భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాకిస్థాన్ క్రికెట్ మహమ్మద్ హఫీజ్ దిగిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే... రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని అండర్-19 జట్టు జనవరి 13 నుంచి జరగనున్న వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్‌కు గత గురువారం బయల్దేరిన సంగతి తెలిసిందే.
భారత సీనియర్ జట్టుతో కలిసి దుబాయి వరకు ఒకే విమానంలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో దుబాయిలో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్.. ది వాల్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. హఫీజ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ట్వీట్ పెద్ద వైరల్ అయింది.
'క్రికెట్ అభిమానులు 'ద వాల్' అని ముద్దుగా పిలుచుకునే రాహుల్ ద్రవిడ్‌తో. అతనో గొప్ప వ్యక్తి. ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడతాడు. మనలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అతన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది' అని హఫీజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీనిపై పాకిస్థాన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద సంఖ్యలో స్పందించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.