అక్లాండ్: ఒక మ్యాచ్‌లో ఓ రికార్డు సాధించడమే గొప్ప విషయమైతే.. అదే మ్యాచులో అదే రికార్డు బద్దలు కొట్టడం మరో రికార్డు. ఇదే జరిగింది.. శ్రీలంక, న్యూజిలాండ్ ట్వంటీ20 మ్యాచులో. అక్లాండ్ మైదానంలో జరిగిన మ్యాచులో ఈ అద్భుతం చోటు చేసుకుంది.
అది ఆక్లాండ్‌లో శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు పరుగుల సునామీనే సృష్టించారు.

143 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 10 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి సాధించింది. న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ 19బంతుల్లోనే అర్థశతకం సాధించి టీ20లో న్యూజిలాండ్ తరపున వేగవంతమైన అర్ధశతకం సాధించాడు.
అయితే 20 నిమిషాలు ముగియక ముందే వన్‌డౌన్‌లో వచ్చిన మున్రో 14 బంతుల్లోనే అర్ధశతకం(50, ఒక ఫోర్, 7 సిక్స్‌లు) సాధించి గుప్తిల్ రికార్డును తిరగరాశాడు.
అంతేగాకుండా, టీ20లో అత్యంత వేగంగా అర్థశతకం చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, ఈ జాబితాలో భారత ఆటగాడు యువరాజ్‌సింగ్(12 బంతుల్లో) తొలిస్థానంలో కొనసాగుతున్నాడు.