హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన హైదరాబాదీ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ మీదుగా ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం 9 గంటలకు సిరాజ్ నగరానికి వచ్చాడు. హనుమ విహారి కూడా భాగ్యనగరం చేరుకున్నాడు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి సిరాజ్ నేరుగా టోలిచౌక్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. సిరాజ్ సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన అనుభవాలను అతడు పంచుకోనున్నాడు.
సిడ్నీ టెస్టులో రెండు రోజులు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొని ఇబ్బందులు పడిన మొహ్మద్ సిరాజ్.. టీమిండియా సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాను వణికించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం ఐదు వికెట్లు తీసి ఆసీస్ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించాడు. ఇక రిషభ్ పంత్ (89) చెలరేగడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. సిరాజ్ అత్యధిక వికెట్లు (13) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
మొహ్మద్ సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ 2020లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ తర్వాత సిరాజ్ నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. టూర్లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు.
టీమిండియా ప్లేయర్స్‌కు క్వారంటైన్ కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు. ఎక్కడికి వెళ్లినా అక్కడ క్వారంటైన్ తప్పనిసరిగా ఉంటున్నారు. ఆస్ట్రేలియా టూర్‌ను ముగించి స్వదేశానికి చేరుకున్న ప్లేయర్స్‌కు ఇక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. ఇక్కడ కూడా హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అని వాళ్లకు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లోనే వాళ్లకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. క్వారంటైన్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని, అందరకూ కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సూచించారు.
టీమిండియాకు ఘన స్వాగతం.. కరోనా రూల్స్ సడలించిన ముంబై! క్వారంటైన్ మాత్రం తప్పదు!