పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మరో రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ 7.30కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తొలి ఐపీఎల్ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కన్పిస్తుంది. ఇక ఐపీఎల్ ఈ సీజన్లో మొదటి నుంచి గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా లక్నో గుజరాత్‌ను అధిగమించి నెట్ రన్‌రేట్ వల్ల అగ్రస్థానంలోకి చేరుకుంది. గత వారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో వరుస పరాజయాలతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఇక వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి లక్నో మంచి జోరు మీదుంది. ఇక ఇరు జట్లు ఆడిన 11మ్యాచ్‌లలో 8మ్యాచ్‌లు గెలిచి 16పాయింట్లతో కొనసాగుతున్నాయి.
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా
ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ టాస్ కోసం గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. మేము తొలుత బ్యాటింగ్ చేయాలని ఫిక్సయ్యాం. ఈ పిచ్ మీద వికెట్ బానే కనిపిస్తుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు చాలా మ్యాచ్‌లు గెలిచాయి. స్కోరు బోర్డుపై మంచి స్కోరు ఉంచి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాలనుకుంటున్నాం. మేము గత రెండు ఓటములను మరిచి వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాం. టోర్నమెంట్ ఇంకా ముగియలేదు. మా జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. లాకీ ఫెర్గూసన్ స్థానంలో మాథ్యూ వేడ్, సాయి సుదర్శన్ స్థానంలో సాయి కిషోర్, ప్రదీప్ సాంగ్వాన్ స్థానంలో యష్ దయాల్ బరిలోకి దిగుతున్నారు.
మేం అనుకున్నట్లే జరిగింది
టాస్ ఓడిన కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. టాస్ వల్ల మాకు అంతా అనుకూలంగానే జరిగింది. పిచ్ విషయంలో మాకు క్లారిటీ లేదు కాబట్టి మొదట బౌలింగ్ చేసి గుజరాత్‌ను కట్టడి చేయాలనుకున్నాం. ఛేజింగ్ అనేది మాకు సరైనది అని నేను అనుకుంటున్నాను. మా వ్యూహాలను సరిగ్గా అమలుపర్చాలని భావిస్తున్నాం. మా జట్టులో ఓ మార్పు ఉంది. రవి బిష్ణోయ్ స్థానంలో కరణ్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున ఒక్కో ప్లేయర్ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడబోతున్నారు. లక్నో తరఫున కరణ్ శర్మ తొలి మ్యాచ్ ఆడనుండగా.. గుజరాత్ టైటాన్స్ తరఫు సాయి కిషోర్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేయబోతున్నాడు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ