
పెద్ద పేర్ల జోలికి వెళ్లలేదు..
మినీ వేలానికి ముందు నుంచి శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్ తదితరుల కోసం గట్టి పోటీ తప్పదంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్లను ఏ జట్లు కొనుగోలు చేస్తాయని రూమర్లు కూడా చాలానే వచ్చాయి. అయితే గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ బడా ప్లేయర్లకు దూరంగానే ఉండిపోయింది. ఈ ఆటగాళ్ల పేర్లు వేలానికి వచ్చినప్పుడు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. గుజరాత్ బిడ్డింగ్ వేసిన విధానం చూస్తేనే వాళ్లు వేరే ప్లాన్‌తో వేలానికి వచ్చినట్లు కనిపించింది. గుజరాత్ కొనుగోలు చేసిన ఏకైక బడా ప్లేయర్ కివీస్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ కావడం గమనార్హం. అతన్ని కూడా బేస్ ధర రూ.2 కోట్లకే కొనుగోలు చేసింది.

అనుకున్న వాళ్లందర్నీ కొనేసింది
ఈ వేలానికి తమ పర్సులో రూ.19 కోట్లతో గుజరాత్ వచ్చింది. ఇక్కడే గుజరాత్ ప్లాన్ స్పష్టంగా కనిపించింది. కనిపించిన ప్రతి ఆటగాడినీ కొనుగోలు చేయాలని గుజరాత్ థింక్ ట్యాంక్ అనుకోలేదు. స్పెసిఫిక్‌గా కొందరు ఆటగాళ్లనే టార్గెట్ చేసింది. అలా తాము టార్గెట్ చేసిన ఏడుగురు ఆటగాళ్లనూ కొనుగోలు చేసింది. ఇలా 100 శాతం టార్గెట్ చేసిన ఆటగాళ్లను మరే జట్టూ కొనుగోలు చేయలేదు. దానికితోడు మరీ ఎక్కువగా ఖర్చు కూడా చేయలేదు.

డబ్బు మిగిలింది..
కేన్ విలియమ్సన్‌ను అతని బేస్ ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్.. ఎక్కడా విచ్చల విడిగా ఖర్చు చేయలేదు. టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన జోషువా లిటిల్‌ను రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. గుజరాత్ భారీగా ఖర్చు చేసింది దేశవాళీ ప్లేయర్ శివమ్ మావి కోసమే. అతని కోసం రూ.6 కోట్లు ఖర్చు చేసింది. వేలం ముగిసే సమయానికి ఆ జట్టు వద్ద ఇంకా రూ.4.45 కోట్లు మిగిలే ఉన్నాయి. మిగతా జట్లన్నీ బడా ప్లేయర్ల కోసం కొట్టుకు చస్తుంటే గుజరాత్ మాత్రం చల్లగా తమ పని చేసుకుపోయిందని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












