అదే నా బాధ.. మ్యాచ్ గెలిచినా గిల్ అసంతృప్తి!
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సాధించిన ఘనవిజయం తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్‌మన్ గిల్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. మైదానంలో వ్యక్తిగత మైలురాళ్లు లేదా ఆరెంజ్ క్యాప్ వంటి గణాంకాల కంటే, జట్టు విజయమే తనకు అత్యంత ప్రాధాన్యత అని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో కేవలం విజయాలు మాత్రమే సరిపోవని, జట్టును ఫైనల్‌కు చేర్చి కప్పును ముద్దాడడమే తన అసలైన లక్ష్యమని గిల్ పేర్కొన్నాడు. జట్టు సమిష్టి కృషితో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లడం పట్ల గిల్ హర్షం వ్యక్తం చేశాడు.
ఔట్ తీరుపై అసంతృప్తి
86 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. మ్యాచ్‌ను ముగించిన తీరుపై గిల్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. లక్ష్య ఛేదనను మరో రెండు ఓవర్ల ముందే పూర్తి చేసి ఉంటే జట్టు రన్ రేట్‌కు కూడా కలిసొచ్చేదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తనే స్వయంగా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేయాలని భావించినట్లు తెలిపాడు. "నేను క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాల్సింది. కానీ కీలక సమయంలో ఔట్ అవ్వడం నన్ను నిరాశకు గురిచేసింది. తదుపరి మ్యాచ్‌ల్లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను" అని శుభ్‌మన్ గిల్ తన బాధ్యతాయుతమైన ధోరణిని కనబరిచాడు.

బౌలర్ల పోరాటం, కెప్టెన్సీ వ్యూహాలు
ఈ మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శనను గిల్ ప్రత్యేకంగా అభినందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబడ చూపిన తెగువ అమోఘమని అన్నాడు. ఆ సమయంలో వారు వికెట్లు తీసేలా కనిపించారని, అందుకే ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా వారికి వరుసగా ఓవర్లు ఇచ్చానని వెల్లడించాడు. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ సునీల్ నరైన్ వచ్చే వరకు లోతుగా ఉన్నప్పటికీ.. వికెట్లు తీయాలనే పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే తాము బౌలింగ్ మార్పులు చేసినట్లు గిల్ వివరించాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పుంజుకున్నా, తమ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోరును నియంత్రించగలిగారని చెప్పాడు.
మానసిక దృఢత్వమే నా బలం:
తన వ్యక్తిగత సక్సెస్ వెనుక ఉన్న రహస్యాన్ని గిల్ ఈ సందర్భంగా పంచుకున్నాడు. గత కొంతకాలంగా శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక దృఢత్వంపై తాను విశేషంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు. గతంలో జరిగిన పొరపాట్ల గురించి చింతించడం లేదా భవిష్యత్తు గురించి అతిగా ఊహించుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని గిల్ అభిప్రాయపడ్డాడు. "వర్తమానంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మనసు రకరకాల ఆలోచనలకు దారితీసినా, ప్రస్తుత క్షణంలో మన బాధ్యత ఏంటో గుర్తుంచుకోవాలి. ఇదే నా బ్యాటింగ్, కెప్టెన్సీలో మార్పు తీసుకొచ్చింది" అని గిల్ తన పరిణతి చెందిన ఆలోచనా విధానాన్ని బయటపెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications