ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పెట్టిన ఓ పోస్ట్ కొత్త వివాదానికి దారీ తీసింది. కోహ్లీ - గిల్ మధ్య ఏమైనా మనస్పర్థలు ఉన్నాయో, లేదంటే ఆర్సీబీ ఫ్యాన్స్ పై గిల్ మండిపడ్డాడో కానీ... కొత్త కాంట్రవర్సీ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గిల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే?
గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడగానే ఆనందం వ్యక్తం చేసిన కెప్టెన్ గిల్.. ఆ తర్వాత ఓ క్రిప్టిక్ పోస్ట్ పెట్టాడు. మా దృష్టి ఆటపై ఉంది, అరిచి గోల చేయడంలో కాదు అని రాసుకొచ్చాడు. ఈ ఏడు పదాల పోస్ట్.. ఆర్సీబీ ఓటమి గురించే గిల్ పెట్టాడని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ పోస్ట్ లో చివరి మూడు పదాలు మాత్రంపై మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దాని గురించేనా?
గిల్ ఏ నాయిస్ గురించి మాట్లాడుతున్నాడు? చిన్నస్వామి స్టేడియంలో గట్టిగా అరుస్తూ గోల చేసిన RCB ప్రేక్షకుల గురించా? లేదంటే గిల్ వికెట్ ను భువి తీసినప్పుడు కోహ్లీ గంతులేస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం గురించా? అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఎక్కువ శాతం గిల్.. ఈ పోస్ట్‌ను విరాట్‌ను ఉద్దేశించే పెట్టాడని అంటున్నారు.
గిల్ సోదరి గురించా?
మరి కొంత మంది గిల్ - కోహ్లీ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, గిల్ పెట్టిన పోస్ట్ కోహ్లీ గురించి కాదని అంటున్నారు. వారిద్దరు మ్యాచు సమయంలో కలిసి సరదాగా నవ్వుకుంటూ దిగిన ఫొటోను పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది.. ఐపీఎల్ 2023లో ఆర్సీబీపై గుజరాత్ గెలిచినప్పుడు, గిల్ సోదరి షానీల్ పెట్టిన పోస్ట్ కు సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు దానికి సమాధానంగానే గిల్.. తాజా రిప్లై ఇచ్చాడని అంటున్నారు.