700 కోట్లు: ప్రపంచంలోనే పెద్ద స్టేడియానికి పునాది రాయి
హైదరాబాద్: ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకరార్పణ జరిగింది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) ఆధ్వర్యంలో రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ స్టేడియానికి సోమవారం పునాది రాయి వేశారు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) ఉపాధ్యక్షుడు పరిమల్ నాథ్వానీ, ఆఫీస్ బేరర్లతో కలిసి సోమవారం స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను లాంఛనంగా నిర్వహించారు. అనంతరం స్టేడియానికి పునాది రాయి వేశారు.
మొతేరాలోని సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం స్థానంలో దీనిని నిర్మిస్తున్నారు. కూల్చివేయబడిన సర్దార్‌పటేల్ స్టేడియం స్థలంలో మరో కొత్త దాన్ని నిర్మిస్తున్నామని, దీనిని రెండేళ్లలో పూర్తి చేస్తామని జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమల్ నాథ్వానీ చెప్పారు.

రూ. 700 కోట్ల బడ్జెట్‌తో
మొత్తం 63 ఎకరాల పరిధిలో లక్షా పదివేల మంది కూర్చునే విధంగా సీటింగ్ సామర్థ్యంతో రూ. 700 కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలవనుంది. కాగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న క్రికెట్ మైదానంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది.

స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1,00,204
మెల్‌బోర్న్ స్టేడియం సామర్థ్యం 90,000. మొతేరాలో నిర్మిస్తున్న స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1,00,204గా ఉంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జీసీఏ సంయుక్త కార్యదర్శి జేషాతో పాటు గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్, అక్షర్ పటేల్ కూడా పాల్గొన్నారు.

ఈ స్టేడియాన్ని లార్సెన్ అండ్ టూబ్రో నిర్మిస్తోంది
ప్రధాని నరేంద్రమోడీ, గుజరాత్‌కు అందిస్తున్న కలల ప్రాజెక్టుగా ఈ స్టేడియాన్ని లార్సెన్ అండ్ టూబ్రో నిర్మిస్తోంది. మొతేరాలోని పాత క్రికెట్ మైదానాన్ని మరింత విస్తృత పరచాలన్నది జీసీఏ అభిమతం. ఇందులో భాగంగా ఈ స్టేడియం నిర్మాణం నిమిత్తం జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమళ్ నత్వానీ ఎల్ అండ్ టీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 54,000
ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 54,000గా ఉంది. దీని స్ధానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. స్టేడియం సిద్ధమైన తర్వాత, అంత భారీ సంఖ్యలో క్రీడాభిమానులు మైదానం లోనికి వెళ్లి, సులువుగా, వేగంగా బయటకు వచ్చేందుకు అవసరమైనన్ని ద్వారాలను ఏర్పాటు చేయనున్నట్టు జీసీఏ కార్యదర్శి రాజేష్ పటేల్ వెల్లడించారు.

టాప్ స్టేడియాల్లో భారత్‌కు చెందిన ఐదు స్టేడియాలు
ప్రపంచంలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ సామర్థ్యం కలిగి ఉన్న టాప్ స్టేడియాల్లో భారత్‌కు చెందిన ఐదు స్టేడియాలు ఉన్నాయి. కోల్‌కత్తాలోని ఈడెన గార్డెన్స్ (66,000), షాహిద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, నయా రాయ్ పూర్ (65,000), జవహార్ లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియం, కొచ్చి (60,000), రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (60,000) సీట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications