
అదానీ స్పోర్ట్స్‌లైన్ యాజమాన్యంలోని గుజరాత్ జెయింట్స్ కీలక ప్రకటన చేసింది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను శనివారం తమ జట్టులోకి తీసుకుంది. సెప్టెంబర్ 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కోసం జమైకన్ ఆల్‌రౌండర్ వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ తరఫున క్రిస్ గేల్ ఆడనున్నాడు. ముసాయిదా నిబంధనల ప్రకారం.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీలు తమ అందుబాటులో ఉన్న ఫ్రాంచైజీల పర్స్ లిమిట్‌తో అదనపు ప్లేయర్లను ఎంచుకుని తమ పూర్తి జట్టును ఖరారు చేసుకోవడానికి మరో మూడు రోజుల సమయం ఉంది. వర్చువల్ డ్రాఫ్ట్ సమయంలో శుక్రవారం 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి గుజరాత్ జెయింట్స్ ఇప్పటికే రూ.5.51కోట్లు ఖర్చు చేసింది. ఇంకా రూ. 2.48కోట్ల పర్స్ డబ్బు మిగిలి ఉంది. ఈ డబ్బుతో క్రిస్ గేల్‌ను కొనగా అలాగే మరికొందరిని కొనే వీలుంది.
'శుక్రవారం డ్రాఫ్ట్ తర్వాత.. గుజరాత్ జెయింట్స్ తమ రూ.8కోట్ల ఫ్రాంచైజ్ పర్స్ నుంచి క్రిస్ గేల్‌ను కొనుగోలు చేయాలనుకున్నారు. మేము గేల్‌తో చర్చించి ఈ ప్రక్రియను పూర్తి చేశాం. గేల్ అదానీ స్పోర్ట్స్‌లైన్ జట్టుకు ఆడటం చాలా సంతోషంగా ఉంది. గేల్ టీ20 స్పెషలిస్ట్ మాత్రమే కాదు, అతను టీ20 క్రికెట్లో అనేక రికార్డులను కలిగి ఉన్నాడు.' అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. ఇకపోతే గుజరాత్ జెయింట్స్ జట్టు చాలా పటిష్ఠంగా కన్పిస్తుంది. పార్థివ్ పటేల్, వెస్టిండీస్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ లాంటి టాపార్డర్ బ్యాటర్లు ఉన్నారు. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి లాంటి స్పిన్ దళం ఉంది. మిచెల్ మెక్‌క్లెనాగన్ లాంటి పేస్ స్టార్లు ఉన్నారు.
గుజరాత్ జెయింట్స్ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, డేనియల్ వెట్టోరి, కెవిన్ ఓబ్రియన్, స్టువర్ట్ బిన్నీ, మిచెల్ మెక్లెనాఘన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా, అజంతా మెండిస్.