సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఓడింది. సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించి, ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా హెన్రిక్ క్లాసెన్ (64) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ (27) మంచి సహకారం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు అందరూ కట్టకట్టుకొని చేతులెత్తేయడంతో ఫలితం మాత్రం ఈ జట్టుకు అనుకూలంగా రాలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు బంతితో మంచి ఆరంభమే లభించింది. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే ప్రమాదకర వృద్ధిమాన్ సాహా (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కూడా అతని జోరు కొనసాగింది. అతనికి నటరాజన్, ఫజల్లాక్ ఫరూఖీ, మార్కో యాన్సెన్ కొంత సహకారం అందించారు.

అయితే గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101), సాయి సుదర్శన్ (47) రాణించడంతో ఆ జట్టు 188/9 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు సరైన ఆరంభం దక్కలేదు. యువ ఓపెనర్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్ (5), అభిషేక్ శర్మ (5) ఇద్దరూ విఫలమయ్యారు. తనను తాను మూడో స్థానానికి ప్రమోట్ చేసుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (10), రాహుల్ త్రిపాఠీ (1) ఇద్దరూ కూడా ఘోరంగా ఫెయిలయ్యారు.
కొత్త కుర్రాడు సన్వీర్ సింగ్ (7) భారీ షాట్ ఆడబోయి సాయి సుదర్శన్‌కు చిక్కాడు. అబ్దుల్ సమద్ (4), మార్కో యాన్సెన్ (3) కూడా రాణించలేదు. చివర్లో మయాంక్ మార్కండే (18 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పేసర్లు వెటరన్ పేసర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ ఇద్దరూ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ విజయంపై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. 'మా కుర్రాళ్లను చూస్తే చాలా గర్వంగా ఉంది. గతేడాది పరిస్థితి వేరు. మాకు చాలా సవాళ్లు ఎదురవుతాయని ముందే ఊహించాం. ప్లేఆఫ్స్ స్థానాన్ని మేం కష్టపడి సంపాదించాం. టీం స్టాండింగ్ గురించి, దాని వల్ల మాపై ఉండే ఒత్తిడి గురించి నేను మా వాళ్లతో మాట్లాడా. ఇవన్నీ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న దానిపైనే ఫోకస్ పెట్టాలని చెప్పా' అని తెలిపాడు.
'మేం ఈ సీజన్‌లో చాలా నిలకడగా రాణిస్తూ వచ్చాం. మేం ఓడిన మ్యాచుల్లో కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓడామే కానీ.. చివరి వరకు పోరాడాం. నా అంత వరకు బౌలర్లంటే నాకు చాలా ఇష్టం. బ్యాటర్లు మరీ ఎక్కువ క్రెడిట్ కొట్టేస్తారని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కొన్ని ఓవర్లు చాలా ముఖ్యం. నేను బౌలర్ల కెప్టెన్‌ని. వాళ్లకు దక్కాల్సిన క్రెడిట్ వాళ్లకు దక్కేలా చూసుకుంటా' అని చెప్పుకొచ్చాడు.