గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బలమైన రాజస్థాన్ బ్యాటింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో మరో ఓటమిని మూటగట్టుకుందీ జట్టు. రాజస్థాన్ ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. అదే సమయంలో ఈ విజయంతో టేబుల్ టాపర్లుగా తమ స్థానాన్ని గుజరాత్ మరింత పదిలం చేసుకుంది.
రాజస్థాన్ నిర్దేశించిన 118 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ కేవలం 13.5 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. దీంతో ఆ టీం నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. దీంతో పది మ్యాచులు ఆడిన జట్లు అన్నింటి కన్నా ఎక్కువ విజయాలతోపాటు, ఎక్కువ నెట్ రన్ రేట్ కూడా ఉన్న టీంగా గుజరాత్ నిలిచింది. ఆ టీం స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇద్దరూ కలిసి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టారు. వీళ్లిద్దరూ 39 పరుగులే ఇచ్చి ఐదు కీలక వికెట్లు తీసుకున్నారు.

ఇలా తాము చిత్తుగా ఓడిపోవడంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. 'ఇది ఒక టఫ్ నైట్. పవర్‌ప్లేలో మేం చాలా బాగా రాణించాం. మంచి ఆరంభం దొరికింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈ పిచ్‌పై 120 పరుగులు డిఫెండ్ చేసుకోవాలంటే అది చాలా కష్టమైన పని. బౌలర్లు రాణించడానికి అవసరమైన స్కోరు అక్కడ లేదు' అని స్పష్టం చేశాడు.
గుజరాత్ బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారని, మిడిల్ ఓవర్లలో కీలకమైన వికెట్లు తీసుకుంటూ పోయారని మెచ్చుకున్నాడు. 'ఈ ఓటమి గురించి కచ్చితంగా డ్రెస్సింగ్ రూంలో చర్చిస్తాం. కానీ దీనిపై మరీ లోతుగా వెళ్లకూడదు. మరొక రోజు ఆగితే ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మేం ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాం. కానీ కొన్ని మార్పులతో రాణించాల్సి ఉంది. ఈ వారంలో కచ్చితంగా విజయాలు సాధించాలని ఆకలితో ఉన్నాం' అని పేర్కొన్నాడు.