గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ తడబడింది. మంచి టచ్‌లో కనిపించిన జోస్ బట్లర్ (8) రెండు ఫోర్లు బాది.. ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ (14), సంజూ శాంసన్ (30) జత కలిశారు. వీళ్లిద్దరూ చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.
గుజరాత్ ప్రధాన పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేసిన యశస్వి జైస్వాల్.. అతను వేసిన ఓవర్లో ఒక అద్భుతమైన సిక్స్, ఫోర్ బాదాడు. ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో శాంసన్ కూడా ఒక ఫోర్, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇలా ఇద్దరూ మంచి టచ్‌లో కనిపించడంతో రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ సంజూ చేసిన ఒక పొరపాటుతో అంతా తలకిందులైంది.

రషీద్ ఖాన్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో బంతిని సంజూ కట్ చేశాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మోహిత్ శర్మ వేగంగా రియాక్ట్ అయ్యి.. ఆ బంతి తనను దాటకుండా అడ్డుకున్నాడు. ఇది ఊహించని సంజూ.. సింగిల్ కోసం రెండు అడుగులు ముందుకు వేశాడు. అప్పుడు మహిత్ ఈ బంతిని ఆపడం చూసి సింగిల్ కూడా తీయలేమని సంజూ భావించాడు.
అయితే అప్పటికే జైస్వాల్ వేగంగా స్ట్రైకర్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. సంజూ వెనక్కు తిరిగేసరికి అక్కడి వరకు వచ్చిన అతను మళ్లీ వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటికే బంతి పట్టేసిన మోహిత్.. దాన్ని రషీద్ ఖాన్‌కు విసిరాడు. అతను వేసిన సింపుల్ త్రోను అందుకున్న రషీద్ వికెట్లను కూల్చడంతో ఫామ్‌లో ఉన్న జైస్వాల్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇదంతా చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు. జైస్వాల్‌ను సంజూనే అవుట్ చేశాడని కొందరు అంటుంటే.. అక్కడ సింగిల్ లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే జోష్ లిటిల్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ కూడా అవుటయ్యాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి బాగా ఎత్తుగా లేచింది. దాన్ని హార్దిక్ పాండ్యా సులభంగా అందుకున్నాడు. దీంతో సంజూ కూడా పెవిలియన్ చేరాడు.