గుజరాత్ టైటాన్స్ ఆడిన చివరి మ్యాచ్‌లో విజయం తమదే అనుకుంటే.. రింకూ సింగ్ చెలరేగి విజయాన్ని లాక్కున్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో అతను వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఈ పరాజయం తర్వాత గుజరాత్ ఆడుతోంది పంజాబ్ కింగ్స్‌తో. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పేస్ బౌలర్లు కీలక కానున్నారు. అయితే కోల్‌కతా మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన యష్ దయాళ్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తారా? అనేది అనుమానంగా మారింది.
దీనిపై ప్రముఖ కామెంటేటర్, టీమిండియా మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా స్పందించాడు. తనను అడిగితే ఈ మ్యాచ్‌లో యష్ దయాళ్‌కు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. ఇలా చేయడం వల్ల రింకూ సింగ్ మిగిల్చిన పీడకల నుంచి కోలుకునే అవకాశం యష్ దయాళ్‌కు దక్కుతుందని అంటున్నాడు. అయితే మొహాలీ పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందుతుంది.

ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో మొత్తం 18 వికెట్లు పడగా.. వాటిలో 8 వికెట్లను పేసర్లే తీసుకున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యష్ దయాళ్‌ను ఆడించాలని గుజరాత్ టీం మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. అయితే ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఆకాష్ చోప్రా అంటుననాడు. 'బౌలింగ్‌లో శివమ్ మావిని ఆడించి, యష్ దయాళ్‌కు విశ్రాంతి ఇవ్వాలి. చివరి మ్యాచ్‌లో అలా జరిగిన తర్వాత కోలుకోవడానికి అతనికి సమయం పడుతుంది' అని చోప్రా వివరించాడు. మిగతా బౌలింగ్ యూనిట్ అంతా బాగానే ఉందన్నాడు.
అల్జారీ జోసెఫ్, జోషువా లిటిల్, మహమ్మద్ షమీ ముగ్గురూ చక్కగా బౌలింగ్ చేస్తున్నారని చోప్రా కొనియాడాడు. వీరితోపాటు రషీద్ ఖాన్ రూపంలో టాప్ స్పిన్నర్ కూడా ఆ టీంలో ఉన్నాడు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన చోప్రా.. ఈ జట్టు వద్ద బలమైన బౌలింగ్ యూనిట్ ఉందని, అలాగే మంచి ఆప్షన్లు కూడా ఉన్నాయని వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా కూడా సూపర్ బౌలర్ అని మర్చిపోకూడదని గుర్తుచేశాడు. మరి గుజరాత్ జట్టు యష్ దయాళ్‌కు విశ్రాంతి ఇచ్చి శివమ్ మావిని ఆడిస్తుందో లేదో చూడాలి.