గుజరాత్, ముంబై మ్యాచ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ బ్యాటర్ విష్ణు వినోద్. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌తోపాటు ఫామ్‌లో ఉన్న నేహాల్ వధీర కూడా అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వినోద్ చూడచక్కని షాట్లతో అలరించాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరి పార్టనర్‌షిప్‌తోనే ముంబై టీం మెరుగైన స్కోరు చేసింది.
ఈ క్రమంలోనే విష్ణు వినోద్ బ్యాటింగ్ చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి ప్లేయర్ ఇప్పటి వరకు ఎక్కడ దాక్కున్నాడు? అనుకున్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే 30 పరుగులు చేసిన వినోద్ బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ కూడా సూపర్ అంటూ మెచ్చుకున్నారు. మరి అసలు ఈ వినోద్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు?

29 ఏళ్ల వినోద్.. కేరళకు చెందిన వాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా దేశవాళీల్లో మంచి అనుభవం ఉన్న ప్లేయర్. దేశవాళీల్లో 50 టీ20లు ఆడిన అతను 138.81 స్ట్రైక్ రేటుతో 1191 పరుగులు చేశాడు. 2014 ఏప్రిల్‌లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో టీ20 అరంగేట్రం చేసిన వినోద్.. ఆ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొని 33 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీ తరఫున మూడు మ్యాచులు ఆడిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం 19 పరుగులే చేశాడు. దీంతో అతన్ని ఆర్సీబీ వదిలేసింది.
ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అతన్ని కొనుగోలు చేశాయి. కానీ ఈ జట్ల తరఫున ఆడే అవకాశం మాత్రం అతనికి రాలేదు. అయితే ఇటీవల దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన అతనిపై ముంబై ఇండియన్స్ నమ్మకం ఉంచింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడించింది. ఈ మ్యాచ్‌తో తనలో ఎంత ట్యాలెంట్ ఉందో వినోద్ అందరికీ చూపించాడు.