గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. అలాగే గుజరాత్‌ను గెలిపించడానికి రషీద్ ఖాన్ కూడా శాయశక్తులా ప్రయత్నించాడు. అందరి అటెన్షన్ వీరి మీదనే పడింది. అయితే ఈ మ్యాచ్‌లో మరో ప్లేయర్ కూడా అద్భుతంగా ఆడాడు. అతనే పీయూష్ చావ్లా.
ఈ ఐపీఎల్ సీజన్‌లో అనుభవం లేని ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ఒక్కడే ముందుండి నడిపిస్తున్నాడీ వెటరన్ స్పిన్నర్. తను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీసుకుంటున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 19 వికెట్లు తీసుకొని స్తతా చాటాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

ఈ సీజన్‌లో తను ఇంత బాగా ఆడటం గురించి చావ్లా తన మనసులో మాట చెప్పాడు. 'నేను నా కొడుకు కోసం ఆడుతున్నా. నేను క్రికెట్ ఆడటం వాడు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నేను ఆడే టైంలో వాడు చాలా చిన్న వాడు. కానీ ఇప్పుడు వాడు ఈ ఆటను అర్థం చేసుకుంటున్నాడు. నేను ఏం చేస్తున్నానో కూడా వాడికి తెలుస్తోంది' అని చెప్పాడు.
'ఇప్పుడు ఇంకా వాడి వయసు ఆరేళ్లు మాత్రమే. కానీ ఈ ఆట వాడికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. వాడి కోసమే నేను ఇంత కష్టపడి ఆడుతున్నా' అన్నాడీ వెటరన్ స్పిన్నర్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలవడానికి చావ్లా కేవలం 12 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ఐపీఎల్‌లో 174 వికెట్లు తీసుకున్నాడు.
ఈ ఏడాది ముంబై ఆడిన అన్ని మ్యాచుల్లో బౌలింగ్ చేసిన చావ్లా.. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ యూనిట్‌ను ముందుండి నడిపించాడు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తీసుకురావడంతో ఐపీఎల్ జట్లన్నీ వెటరన్లకు మళ్లీ ఆడే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. లక్నోలో అమిత్ మిశ్రా, ఢిల్లీలో ఇషాంత్ శర్మకు కూడా ఆడే ఛాన్స్ దొరికింది.