గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా గెలిచింది. చివరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా.. యువ ప్లేయర్ రింకూ సింగ్ చెలరేగాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాది తమ జట్టుకు ఊహించని విజయం అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ పెద్ద స్టార్ అయిపోయాడు. అప్పటి వరకు అతన్ని పెద్దగా పట్టించుకోని వాళ్లు కూడా రింకూను సూపర్ స్టార్ అనడం మొదలు పెట్టారు.
అదే సమయంలో ఈ చివరి ఓవర్ వేసిన యష్ దయాళ్ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. చివరి ఓవర్లో 28 పరుగులు కాపాడుకోవాల్సిన స్థితిలో బంతి అందుకున్న అతను.. వరుసగా ఫుల్‌టాస్‌లు వేశాడు. వాటన్నింటినీ రింకూ స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ అభిమానులు షాకైపోయారు. యష్ దయాళ్ బౌలింగ్ ట్యాలెంట్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది సహజంగా జరిగేదే. ఎందుకంటే అతను వరుసగా ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు.

అంతేకాదు, ఆ సిక్సర్లు బాదిన వ్యక్తి అంతర్జాతీయ క్రికెటర్ కూడా కాదు. ఇప్పటి వరకు కెరీర్‌లో అంత గొప్ప ఇన్నింగ్స్‌లు లేని ఒక ప్లేయర్. అఫ్‌కోర్స్ రింకూ చాలా ట్యాలెంట్ ఉన్న ఆటగాడే. అతను గతేడాది ఐపీఎల్‌లో తన ఫీల్డింగ్‌తో కొంత గుర్తింపు సంపాదించాడు. అంతకుమించి రింకూ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్సులు ఏవీ లేవు. అలాంటి ప్లేయర్ ఇలా హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు బాదడం ఒక ఆశ్చర్యం. అదే సమయంలో అలాంటి బంతులు వేసిన బౌలర్‌పై అభిమానులకు కోపం రావడం కూడా సహజమే.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎందరో యువ బౌలర్లు అంతర్జాతీయ బౌలర్లకు తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. కానీ యష్ దయాళ్ మాత్రం ఇలా ఐదు సిక్సర్లు బాదించుకొని తలదించుకున్నాడు. ఈ ఓవర్ ముగిసిన తర్వాత అతను మొఖం దాచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం అందరూ చూశారు. దీనిపై కేకేఆర్ టీం కూడా స్పందించింది. 'తలెత్తుకొని ఉండు చాంప్. ఈ రోజు నీది కాదంతే. క్రికెట్‌లో అద్భుతమైన ప్లేయర్లకు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. నువ్వు ఒక ఛాంపియన్‌వి. నీ పునరాగమనం ఇంకా గొప్పగా ఉంటుంది' అని కేకేఆర్ ట్వీట్ చేసింది.