ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచులన్నింట్లో అన్నింటి కన్నా థ్రిల్లింగ్ మ్యాచ్ ఏది? అని అడిగితే చాలా మంది ప్రేక్షకులకు గుర్తొచ్చేది కోల్‌కతా, గుజరాత్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన కోల్‌కతా ఓటమి దిశగా సాగింది. ఇక ఆ టీం కచ్చితంగా ఓడిపోతుందని అనుకున్నారు.
చివరి ఓవర్లో 28 పరుగులు అవసరమవగా.. కేకేఆర్ కుర్ర హీరో రింకూ సింగ్ ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్ పెద్ద హీరో అయిపోయాడు. అయితే ఇలా ఓడిపోవడం గుజరాత్‌కు పెద్ద షాకిచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు కూడా అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే ఈ రెండు జట్లు మొదట తలపడినప్పుడు ఐపీఎల్ మొదలై ఎక్కువ రోజులు కాలేదు. ఏ జట్టూ ఫేవరెట్ అని కచ్చితంగా చెప్పలేం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేకేఆర్ వరుస ఓటములతో బాగా వెనుకబడింది. అదే సమయంలో గుజరాత్ టాప్-4లో తన స్థానాన్ని నిలుపుకుంది.
దానికితోడు ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచులో హార్దిక్ పాండ్యా ఆడలేదు. ఇప్పుడు పాండ్యాతోపాటు డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా అందరూ సూపర్ ఫామ్ అందుకున్నారు. బౌలర్లు కూడా మంచి ఫామ్ అందుకున్నారు. అదే సమయంలో కేకేఆర్ స్టార్లు ఇంకా తడబడుతూనే ఉన్నారు. వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్‌పై ఆ టీం మరీ ఎక్కువగా ఆధారపడుతోంది.
కేకేఆర్‌కు ఇంకా తమ ఓపెనర్ల విషయంలో ఒక క్లారిటీ రాలేదు. నారాయణ్ జగదీశన్, రహ్మనుల్లా గుర్బాజ్, లిటాన్ దాస్ ఇలా మార్పులు చేస్తూనే ఉంది. దీనికితోడు కుటుంబంలో ఎమర్జెన్సీ రావడంతో లిటాన్ దాస్ తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో కేకేఆర్ మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.