ఐపీఎల్ 2023 చివరి దశకు చేరింది. పది జట్లు పోటీ పడిన ఈ టోర్నీలో ఇప్పుడు చివరి నాలుుగ జట్లు తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి క్వాలిఫైయర్‌లో తలపడనున్నాయి.
లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో పదింట విజయ భేరి మోగించిన గుజరాత్ జట్టు ఏకంగా 20 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో గతేడాది అత్యంత ఘోరమైన ప్రదర్శన చేసిన చెన్నై.. ఈసారి అద్భుతంగా పుంజుకొని రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మొదటి క్వాలిఫైయర్‌పై చాలానే అంచనాలు ఉన్నాయి.

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో చెన్నైకి ఇది కొంత కలిసొచ్చే అంశం అని కొందరు అనుకుంటున్నారు. అయితే గతేడాది గుజరాత్ టైటాన్స్ ఈ లీగ్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఒక్కసారి కూడా చెన్నై గెలవలేదు. మరి మొదటి క్వాలిఫైయర్‌లో కూడా గుజరాత్ ఇదే రికార్డు నమోదు చేస్తుందేమో చూడాలి.
అదే సమయంలో చెన్నైని తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ టీం కెప్టెన్ ధోనీకి టీ20 ఫార్మాట్ అంటే కొట్టిన పిండి. ఎలాంటి పరిస్థితి నుంచైనా జట్టును గెలిపించే వ్యూహాలు వేయడం అతని స్పెషాల్టీ. మరి ఇలాంటి బుర్ర ఉన్న ధోనీ.. గుజరాత్‌పై తన అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ చేరుతుంది. ఇక ఓడిన జట్టు మరో మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే ఎలిమినేటర్‌లో విజేతతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఇంత గొడవ ఎందుకు అనుకుంటే.. చెన్నైకి గానీ, గుజరాత్‌కు కానీ మొదటి క్వాలిఫైయర్ నెగ్గడమే మంచిది.