కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేయగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. నోబాల్ రూపంలో యశ్ దయాల్ వేసిన ఎక్స్ట్రా బాల్‌కు జోస్ బట్లర్‌తో పాటు రియాన్ పరాగ్ రనౌటయ్యాడు. ఇక క్రీజును వీడే క్రమంలో పరాగ్.. అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రన్ కోసం ఎందుకు ప్రయత్నించలేదంటూ గుస్సా అయ్యాడు. అనేక మలుపులు తిరిగిన ఈ ఓవర్ ఆటగాళ్లతో పాటు అభిమానులను అయోమయానికి గురిచేసింది.
అసలేం జరిగిందంటే..? రాజస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులను ఆడిన పరాగ్ క్విక్ డబుల్‌తో పాటు సింగిల్ తీసాడు. మూడో బంతికి బట్లర్ భారీ సిక్సర్ బాదాడు. నాలుగో బంతి డాట్ అవ్వగా.. ఐదో బంతికి క్విక్ డబుల్ తీసిన బట్లర్ ఆరో బంతికి మరో క్విక్ డబుల్ తీసే క్రమంలో రనౌటయ్యాడు. అయితే ఈ బంతిని థర్డ్ అంపైర్ నోబాల్‌గా చేర్చడంతో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. వైడ్ యార్కర్ వేసే క్రమంలో యశ్ దయాల్ వైడ్ వేయగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పరాగ్ రన్ కోసం పరుగెత్తుకొచ్చాడు. కానీ అశ్విని కదలకపోవడంతో అతను రనౌటయ్యాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అతను అశ్విన్‌పై మండిపడుతూ పెవిలియన్ చేరాడు. చివరి బంతికి అశ్విన్ రెండు పరుగులు తీసాడు.
జోస్ బట్లర్(56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్‌కు తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), దేవదత్ పడిక్కల్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.