గుజరాట్ టైటాన్స్ కుర్రాళ్లు అదరగొట్టారు. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలతో విరుచుకుపడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో జీటీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్‌వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5; 4 బంతుల్లో, 1x4)ను స్వప్నిల్ సింగ్ బోల్తా కొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (16; 19 బంతుల్లో; 1x4) నిదానంగా ఆడాడు. దీంతో గుజరాత్ పవర్‌ప్లేలో 42 పరుగులే చేసింది.

పవర్ ప్లే ముగిసిన అనంతరం బంతిని అందుకున్న మాక్స్‌వెల్ గిల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. భారీ షాట్‌కు యత్నించిన గిల్.. కామెరూన్ గ్రీన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుక్ ఖాన్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. సుదర్శన్‌తో కలిసి బౌండరీల మోత మోగించాడు. షారుక్‌క పోటీగా సుదర్శన్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 45 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
తొలుత కుదురుకోవడానికి సమయం తీసుకున్న షారుక్ తర్వాత చెలరేగాడు. 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్ కెరీర్‌లో తనకి ఇదే తొలి హాఫ్ సెంచరీ. అయితే ప్రమాదకరంగా మారుతున్న షారుక్‌ను సిరాజ్ కళ్లుచెదిరే యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బాదే బాధ్యతను సాయి సుదర్శన్ తీసుకున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న అతను అనంతరం దూకుడు పెంచాడు. మిల్లర్ (26*; 19 బంతుల్లో, 2x4, 1x6) తో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు.
మిల్లర్ కూడా హిట్టింగ్ మొదలుపెట్టడంతో పరుగులు పోటెత్తాయి. గ్రీన్‌ను లక్ష్యంగా చేసుకోని సుదర్శన్ హ్యాట్రిక్ బౌండరీలు బాది పరుగులు పిండుకున్నాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 47 పరుగులు సాధించింది. సూర్యుడు ప్రతాపానికి ఆర్సీబీ ప్లేయర్లు తీవ్రంగా అలసిపోయారు.