GT VS MI: ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. అంతలా జట్టుకు క్రేజ్ తీసుకొచ్చాడు. కెప్టెన్ గా జట్టును నడిపించి ఐదు సార్లు టైటిల్స్ ను అందించిన ఘనత అతడిది. ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ 2025లో భాగంగా ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా మ్యాచ్ కు ముందు ముంబయి జట్టుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు. 2011లో తాను ముంబయి జట్టుతో కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న మార్పుల గురించి వివరించాడు.
"నేను ముంబయి జట్టుతో నా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి. మొదట మిడిలార్డర్ బ్యాటర్ నేను. ఇప్పుడు ఓపెనర్. అప్పుడు కెప్టెన్ గా చేశాడు. ఇప్పుడు నా చేతిలో కెప్టెన్సీ లేదు. నాతో కలిసి ఆడి టైటిల్ గెలిచిన ఆటగాళ్లు ఇప్పుడు లేరు. ఇప్పుడు వారు కోచింగ్ బాధ్యతలను వ్యవహరిస్తున్నారు. పాత్రలు మారిపోయాయి. బాధ్యతలు మారాయి. ఇంకా ఎన్నెన్నో మారాయి. కానీ మైండ్ సెట్ మాత్రం మారలేదు. నేను జట్టు కోసం ఏం చేయాలో అది మాత్రం మారలేదు. ఎప్పటికీ అలానే ఉంటుంది. జట్టు కోసం బరిలోకి దిగడం, ట్రోఫీ గెలవడం ఇదే లక్ష్యం. అదే ముంబయికి తెలుసు. ఎవ్వరూ ఊహించలేని స్థాయి నుంచి అత్యధిక సార్లు ట్రోఫీలు గెలిచే స్థాయికి ఎదిగాం.అదే ముంబయి జట్టు అంటే. అందుకే ముంబయి ఇండియన్స్ ప్రత్యేకం." అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఎన్నో ఒడుదొడుకులు చూశా..
గత 9 నెలల్లో.. ఐపీఎల్ 2024లో ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో వెనకబడటం, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించడం, మళ్లీ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీసుల్లో ఓడిపోవడం, అనతరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం.. ఇలా ఎన్నో ఒడుదొడుకులను తన కెరీర్ లో చూశాడు రోహిత్ శర్మ. అవి జీవితంలో తనకెంతో నేర్పించాయని వెల్లడించాడు.
"నా 17-18ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఒడుదొడుకులు చూశాను, అవి నా జీవితంలో ఎన్నో నేర్పాయి. ఇక ఈ 9 నెలలు ఎంతో భిన్నం. మనం గెలిచినా, ఓడినా.. నవ్వడం నేర్చుకోవాలి. ఇది సింపుల్ గా ఉండటానికి చెప్పడానికి. కానీ అందులో చాలా అర్థం దాగి ఉంటుంది. ఏది జరిగినా, చివరికి మనం నవ్వడానికి ఓ దారి వెతుక్కోవాలి. అందులోనే మనశ్శాంతి ఉండేలా చూసుకోవాలి. మేమెప్పుడూ దాని గురించే చర్చిస్తాం. గెలిచినా, ఓడినా అక్కడి నుంచి మరో దారి వెతుక్కొని ముందుకు సాగిపోతాం. పరాజయాలను అధిగమించడం అంత ఈజీ కాదు. కానీ జీవితమంటే పోరాడుతూ ముందుకు వెళ్లడమే. జీవితం ఎప్పడూ అక్కడే ఆగిపోదు. ప్రతీరోజు సూర్యడు ఎలా అయితే ఉదయిస్తాడో, మనం కూడా అలానే పడినప్పుడు లేచినిలబడాలి. కొత్త రోజుతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. చిరునవ్వుతో ముందుకు సాగాలి." అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.