GT vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచులోనూ ఓడిపోయింది. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ పై ఓడిన ఆ జట్టు.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచులోనూ గుజరాత్ టైటాన్స్ పై దారుణంగా ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏకంగా తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ముంబయి మ్యాచ్ ఓటమికి 3 ప్రధాన కారణాలను తెలుసుకుందాం..
1.టాప్ ఆర్డర్ బోల్తా..
ముఖ్యంగా టాప్ ఆర్డర్ బోల్తా కొట్టడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. త్వరత్వరగా వికెట్లు పడిపోయాయి. ముంబయి బ్యాటింగ్ లైనప్ నిలకడగా ఆడేందుకు చాలా కష్టపడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 8 పరుగులకు, రియాన్ రికెల్టన్ 6 పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో 24 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది ముంబయి. దీంతో మిడిలార్డర్ పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది.
బోల్తా పడిన రోహిత్..
తొలి ఓవర్‌లోనే ఔటైన రోహిత్ శర్మ.. మహ్మద్ సిరాజ్ వేసిన రిప్పర్‌కు ఔటయ్యాడు. సిరాజ్ వేసిన బంతి ఆఫ్ సైడ్ స్టంప్‌కు కాస్త అవతలకు పిచ్ అయి వికెట్ల మీదికి దూసుకొచ్చింది. దానిని అంచనా వేయలేకపోయిన హిట్ మ్యాన్.. బ్యాట్‌ను అడ్డం పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే అండ్ ప్యాడ్ మధ్యలోకి వెళ్లిన ఆ బంతి మిడిల్ స్టంప్ బెయిల్‌ను ఎగురేసింది.
2.మిడిల్ ఆర్డర్‌పై భారం..
టాప్ ఆర్డర్ విఫలమవ్వడం వల్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై పూర్తిగా భారం పడింది. అయితే మిడిలార్డర్ కాస్త మంచి ప్రదర్శనే చేసినప్పటికీ, లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించడానికి అవసరమైన దమ్ము చూపలేదు. సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగే ఆడాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. కానీ అతడికి సహచరుల నుంచి తగినంత మద్దతు లభించలేదు. తిలక్ వర్మ 36 బంతుల్లో 39 పరుగులు చేసినా అవసరమైన రన్ రేట్‌ను కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో వచ్చిన హార్దిక్ పాండ్య ఆశించిన ప్రభావం చూపలేదు. జిడ్డూ బ్యాటింగ్ చేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబిన్ మిన్జ్ సింగిల్ డిజిటే చేశాడు. క్లిష్ట సమయాల్లో దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడం చివరికి ముంబయి పతనానికి దారితీసింది.
3.బౌలింగ్ లోనూ సమస్యలు
ముంబయి బౌలింగ్ కొన్ని సందర్భాల్లో మంచిగానే ఉన్నప్పటికీ, ఆటలోని కీలక దశల్లో గుజరాత్ ను అదుపు చేయడంలో బౌలర్ల ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో, తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. దీంతో గుజరాత్ ఇన్నింగ్స్ చివరిలో స్వేచ్ఛగా స్కోరు చేసింది. మొత్తంగా గుజరాత్ అధిక స్కోరును చేయనీకుండా అడ్డుపడినప్పటికీ, ముంబయి బౌలర్లు కాస్త తడబడ్డారు. అందుకే ముంబయి బ్యాటర్లకు కాస్త సవాలుతో కూడిన లక్ష్యమే ఏర్పడింది. ఇకపోతే ముంబయి తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
