అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ పైచేయి సాధిస్తోంది. గుజరాత్ బ్యాటర్లను ఢిల్లీ బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. 48 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టారు. ఈ దెబ్బకి గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంపాక్ట్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ను బరిలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది.
అయితే సాయి సుదర్శన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షారుక్ ఖాన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8; 6 బంతుల్లో, 2x4), వృద్ధిమాన్ సాహా (2; 10 బంతుల్లో), సాయి సుదర్శన్ (12; 9 బంతుల్లో, 2x4), డేవిడ్ మిల్లర్ (2; 6 బంతుల్లో), అభినవ్ మనోహర్ (8; 14 బంతుల్లో, 1x4), షారుక్ ఖాన్ వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఆది నుంచే ఢిల్లీ బౌలర్లు వికెట్ల వేట మొదలుపెట్టడంతో గుజరాత్ టైటాన్స్ పవర్‌ప్లేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు సాధించిన రెండో జట్టుగా గుజరాత్ నిలిచింది. తొలి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తొలి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులే చేసింది. కాగా, గుజరాత్ మరో పేలవ రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయిన మూడో జట్టుగా గుజరాత్ నిలిచింది. గుజరాత్ కంటే ముందు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి.
అయితే గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ సాధిస్తున్న వికెట్ల వేటలో కెప్టెన్ రిషభ్ పంత్‌ది కీలకపాత్ర. మూడు వికెట్లలో పంత్ భాగస్వామ్యమయ్యాడు. కళ్లుచెదిరే క్యాచ్‌తో మిల్లర్‌ను, మెరుపు స్టంపింగ్‌తో అభినవ్ మనోహర్, షారుక్ ఖాన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇషాంత్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై మిల్లర్ షాట్‌కు యత్నించగా అది ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. పంత్ వెంటనే తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. కాగా, ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్, స్టబ్స్ చెరో రెండు వికెట్లు, ముకేశ్ కుమార్ ఓ వికెట్ తీశాడు.