గుజరాట్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సొంతమైదానంలో అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ తొమ్మిదో స్థానం నుంచి ఆరో ర్యాంక్‌కు ఎగబాకింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లో 89 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ (3/14) మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (20; 10 బంతుల్లో, 2x4, 2x6), షై హోప్ (19; 10 బంతుల్లో, 1x4, 2x6), రిషభ్ పంత్ (16*; 11 బంతుల్లో, 1x4, 1x6), అభిషేక్ పోరెల్ (15; 7 బంతుల్లో, 2x4, 1x6), సుమిత్ (9*; 9 బంతుల్లో, 2x4) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.
మ్యాచ్ అనంతరం ఓటమి గురించి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితేనే 89 పరుగుల స్కోరును కాపాడుకోగలిగే వాళ్లమని అన్నాడు. అయితే తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, అయిదు-ఆరు మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
''మా బ్యాటింగ్ చాలా ఏవరేజ్‌గా ఉంది. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగాలనుకుంటున్నాం. వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్ధమై పునరాగమనం చేయాలని భావిస్తున్నాం. వికెట్ ఫర్వాలేదు. బాగానే ఉంది. నేను, సాహా, సాయి సుదర్శన్ ఔటైన తీరును చూడండి. పిచ్ వల్ల వికెట్లు కోల్పోలేదని స్పష్టమవుతుంది. ప్రత్యర్థి జట్టును 89 పరుగులు చేయకుండా అడ్డుకోవాలంటే మా బౌలర్లు డబుల్ హ్యాట్రిక్‌లు సాధించాలి''
''ఈ సీజన్ అర్ధభాగం ముగిసింది. మేం ఇప్పటికి మూడు మ్యాచ్‌లు విజయం సాధించాం. గతంలో మాదిరిగానే సెకండ్ హాఫ్‌లో మరో అయిదు-ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి ప్లేఆఫ్స్‌కు చేరుకుంటామని ఆశిస్తున్నా'' అని గిల్ పేర్కొన్నాడు.