GT vs DC: ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు దిల్లీ క్యాపిటల్స్ పై 200 ప్లస్ పరుగుల ఛేజ్ ను ఏ జట్టు చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి గుజరాత్ టైటాన్స్.. ఆ ఘనత సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ పై 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. జాస్ బట్లర్ (97) చెలరేగాడు. సాయి సుదర్శన్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 36 పరుగులు) రాణించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (7) నిరాశపరిచాడు. షెర్ఫనే రూథర్ ఫోర్డ్ (34 బంతుల్లో 1 ఫోర్ల్, 3 సిక్సుల సాయంతో 43 పరుగులు) అద్భుతంగా రాణించాడు. జోస్ బట్లర్ (97) అద్భుతం చేశాడు. ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
గుజరాత్ ఇన్నింగ్స్ సాగిందిలా..
గుజరాత్ కు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ లో కరుణ్ నాయర్ వేసిన అద్భుత త్రో వల్ల కెప్టెన్ శుభమాన్ గిల్ (7) వెనుదిరిగాడు. అప్పుడు వచ్చిన బట్లర్ తో పాటు సాయి సుదర్శన్ గుజరాత్ ఇన్నింగ్స్ ను పరుగెత్తించారు. దీంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 67 పరుగులు నమోదు చేసింది.
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ జోరు మీదున్న సాయి సుదర్శన్ (36) ను పెవిలియన్ కు పంపాడు. కానీ బట్లర్, రూథర్ ఫోర్డ్ కలిసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ భారీ షాట్లతో చెలరేగి ఆడారు. దీంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ వైపునకు వచ్చేసింది. అయితే జట్టు విజయం కోసం చివరి వరకు క్రీజు లో ఉన్న బట్లర్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరమైన నేపథ్యంలో రాహుల్ తెవాతియా (11*; 3 బంతుల్లో) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన కావడం విశేషం.

ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగినా.. దిల్లీ బ్యాటర్లు సమిష్టిగా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ లో బ్యాటర్లందరూ రాణించారు. అందరూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు అభిషేక్ పొరెల్ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కేసేపే అయినా మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడు ప్రదర్శనే చేశాడు. దీంతో 4 ఓవర్లకే స్కోరు 50 దాటేసింది. ముఖ్యంగా కరుణ్ నాయర్ ధాటిగా ఆడటం వల్ల పవర్ ప్లే ముగిసేసరికి దిల్లీ జట్టు 73/2తో బలమైన స్కోరుకు పునాది వేసుకుంది.ఆ తర్వాత అక్షర్ పటేల్ (32 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి ప్రదర్శనే చేశారు. ఆఖర్లో అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (4/41) అదరగొట్టాడు. అర్షద్ ఖాన్, సిరాజ్, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. దీంతో డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.