GT vs CSK: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అంత గొప్పగా రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో రషీద్ ఖాన్ పరుగులను ఆపలేకపోవడంతో పాటు ఎక్కువ వికెట్లు కూడా తీయలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ ఆఫ్ఘన్ స్పిన్నర్ తన 4 ఓవర్ల స్పెల్‌లో 42 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్ ఖాన్‌ను సీఎస్కే బ్యాటర్లు లక్ష్యంగా చేసుకున్నారు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్లు బాదారు. రషీద్‌కు ఒకే ఒక్క వికెట్ దక్కింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ పేరు మీద నమోదైంది.
రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు
ఒక ఐపీఎల్ సీజన్‌లో ఓ బౌలర్ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన చెత్త రికార్డు ఇప్పుడు రషీద్ ఖాన్ పేరిట నమోదైంది. ఈ జాబితాలో రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇప్పటివరకు మొత్తం 31 సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2022లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో 31 సిక్సర్లు బాదారు. ఈ ఏడాది వనిందు హసరంగా బౌలింగ్ లో 30 సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 18వ సీజన్‌లో 14 మ్యాచ్ ల్లో రషీద్ ఖాన్ 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ కాలంలో రషీద్ ఖాన్ ఎకానమీ కూడా 9.47గా ఉంది.

భారీ స్కోరు చేసిన చెన్నై
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. జట్టు తరఫున డెవిల్డ్ బ్రెవిస్ 23 బంతుల్లో 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో బ్రెవిస్ 4 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో డెవాన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేయగా.. ఆయుష్ మాత్రే 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో రవీంద్ర జడేజా 18 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.