హైదరాబాద్: 'ఒకే దేశం... ఒకే పన్ను' అనే నినాదంతో శుక్రవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీ ప్రభావం క్రీడల మేరకు ఎంత ప్రభావం చూపుతుందోనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జీఎస్టీ అమలుతో ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లను స్డేడియాల్లో చూడాలనుకునే వారికి చేదు వార్తేనని అంటున్నారు. జీఎస్టీ అమలుతో మ్యాచ్‌ల టికెట్ల ధరలు అనూహ్యంగా పెరుగుతాయని అంటున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మ్యాచ్‌ల టికెట్ల ధరలు 28 శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి.

దీని ఫలితంగా ఇప్పటికే వేల రూపాయల్లో ఉన్న ఐపీఎల్ టిక్కెట్ల రేట్లు మరింత పెరగడం ఖాయమని తెలుస్తోంది. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకుంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. మరోవైపు ప్రభుత్వ గుర్తింపు పొందిన భారత క్రికెట్ బోర్డు, హాకీ సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే మ్యాచ్‌లకు మాత్రం జీఎస్టీని 18 శాతానికి పరిమితం చేశారు.
మరోవైపు రూ. 250 కంటే తక్కువ విలువ కలిగిన టిక్కెట్లను జీఎస్టీ నుంచి మినహాయించారు. అయితే వాస్తవానికి స్టేడియాల్లో ఈ సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం గుర్తింపు పొందిన క్రీడా సమాఖ్యలు నిర్వహించే అన్ని ఈవెంట్స్‌ను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

కానీ దీనిపై కాస్త వ్యతిరేకత రావడంతో గురువారం మరోసారి సమావేశమైన అధికారులు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్ధలకు 18 శాతం పన్ను వేయాలని నిర్ణయానికి వచ్చారు.