చెన్నై: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు చెన్నైలో శుక్రవారం నుంచి జరగనుంది. దీంతో ఐదో టెస్ట్ కోసం చెపాక్ మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్ సిబ్బంది తలమునకలై ఉన్నారు. 'వర్దా' తుపాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐదో టెస్టు మ్యాచ్ కోసం చిదంబరం స్టేడియం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సిద్ధం చేస్తోంది. వర్షం కారణంగా మైదానం తడిగా మారినప్పుడు సూపర్ సాపర్లతో అవుట్‌ఫీల్డ్ నుంచి నీరు తొలగించడం, డ్రైయర్లతో పిచ్‌ను ఆరబెట్టడం ఇంతక ముందు మనం చూశాం.
చెన్నైలో ఐదో టెస్టు: ఫ్లడ్‌లైట్లలో బల్బులు పేలిపోయాయి
అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది బొగ్గును మండిస్తున్నారు. వర్దా తుపాను కారణంగా చిదంబరం స్టేడియంలోని పిచ్ బాగా తడిసిపోయింది. పిచ్‌పై ఉన్న తేమను తగ్గించడానికి గ్రౌండ్ సిబ్బంది సంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఎర్రగా కాలుతున్న బొగ్గులను ఇనుప ట్రేలలో పోసి వాటి కింద స్టంప్స్‌ను ఉంచి పిచ్‌పై అటూ ఇటూ తిప్పుతున్నారు. ఇలా చేయడం వల్ల మామూలుగాకంటే చాలా వేగంగా పిచ్ ఆరిపోయి, మ్యాచ్ కోసం అందుబాటులోకి వస్తుందని టీఎన్‌సీఏ నమ్ముతోంది.
పిచ్ ప్రస్తుత స్థితిపై సౌత్‌జోన్ క్యురేటర్ విశ్వనాథన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ''మ్యాచ్‌కు సిద్ధం చేసిన పిచ్, ఔట్‌ఫీల్డ్ మంచి స్థితిలో ఉన్నాయి. ఐతే మ్యాచ్ సందర్భంగా పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పలేను'' అని అన్నాడు. ఇక చెన్నై స్టేడియానికి అత్యున్నత డ్రైనేజీ వ్యవస్థ ఉందని విశ్వనాథన్ తెలిపారు.
శుక్రవారం నుంచి చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు జరగనుంది. బుధవారం స్టేడియం తడిగా ఉండటంతో ఇరు జట్లూ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాయి. ఔట్ ఫీల్డ్ కూడా ఆరకపోవడంతో గురువారం కూడా నెట్ ప్రాక్టీస్ సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఐదో టెస్టును ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలో టీఎన్‌సీఏ అందు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.