ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆశ్చర్యం గొలిపే అంశం ఇది. కనీసం గల్లీ క్రికెట్‌లో కూడా ఇటువంటి వింత చోటు చేసుకుని ఉండకపోవచ్చు. అలాంటి వింత ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఓ ఇంగ్లీషు క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు బరిలోకి దిగి 20 బంతులను ఎదుర్కొని 10 వికెట్లను కోల్పోయింది.
ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే అసలు ఖాతా తెరవకుండానే ఆలౌటైంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి 120 పరుగులు చేసిన ప్రత్యర్ధి జట్టు 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్‌లోని ఈ వింత సంఘటన కెంట్ ప్రాంతీయ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

ఈ విషయం తెలియడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆశ్చర్యపోయింది. అంతేకాదు తన ట్విట్టర్ ద్వారా స్కోరు బోర్డుని కూడా పోస్టు చేసింది. వివరాల్లోకి వెళితే కంటెర్‌బరీ క్రికెట్ మైదానంలో బాప్‌చైల్డ్ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వింత చోటుచేసుకుంది.