మమ్మల్ని కాపీ కొట్టినా.. ద్రవిడ్ అద్భుతాలు చేశాడు! టీమిండియా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అతడే: చాపెల్

సిడ్నీ: మాజీ క్రికెటర్, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ కృషి వల్లే టీమిండియా ఈ స్థాయికి చేరుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అన్నారు. యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చే విషయంలో ఆస్ట్రేలియా గతంలో అవలంభించిన పద్ధతులను అవపోసన పట్టిన ద్రవిడ్.. భారత్‌లో మార్పులకు నాంది పలికాడని చాపెల్ చెప్పుకొచ్చారు. పటిష్టమైన దేశవాళీ టోర్నీల ద్వారా మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి జాతీయ జట్టుకు అందించడంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ ద్రవిడ్ కృషి ఎనలేనిదన్నారు. ఆసీస్ కంటే కూడా ద్రవిడ్ మెరుగైన ప్రతిభాన్వేషణ వ్యవస్థను రూపొందించాడని కంగారూల మాజీ సారథి ప్రశంసించారు.

ద్రవిడ్ అద్భుతాలు చేశాడు:
తాజాగా గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ... 'రాహుల్ ద్రవిడ్ ఆస్ట్రేలియా విధానాల్ని ఎంచుకున్నాడు. అధిక జనాభా ఉన్న భారత్‌లో కంగారూల పద్ధతుల్ని ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. యువ ఆటగాళ్లను గుర్తించి.. అవకాశాలు కల్పించడంలో ఆసీస్‌దే అత్యుత్తమ వ్యవస్థ. అయితే గత రెండేళ్లలో ఇది పూర్తిగా మారింది. అద్భుతమైన ప్రతిభావంతుల సమూహం అయోమయంలో ఉండటం చూస్తున్నా. ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రతిభను గుర్తించడం.. అవకాశాలు కల్పించడంలో ఆసీస్ తన స్థానాన్ని కోల్పోయిందని భావిస్తున్నా. ఈ విషయంలో ఇంగ్లండ్, భారత్‌లు ఆసీస్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి' అని అన్నారు.

అప్పటికే రాటుదేలారు:
'ఈ ఏడాది ఆరంభంలో బ్రిస్బేన్ టెస్టు ఆడిన భారత జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోవడం, స్టార్ ఆటగాళ్లకు గాయాలు అయ్యాయి. దాంతో ఆ టెస్టులో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడుతోందని చాలా మంది వ్యాఖ్యానించారు. ఆ కుర్రాళ్లు ఇండియా-ఎ తరఫున ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆడారు. అంతర్జాతీయ స్థాయికి వచ్చేలోపే రాటుదేలారు. మరోవైపు షీల్డ్ క్రికెట్లో సత్తాచాటిన విల్ పకోవ్‌స్కీని ఆసీస్ ఎంపిక చేసింది. ఆసీస్ వెలుపల అతను పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. అదే తేడా' అని కంగారూల మాజీ సారథి గ్రెగ్ చాపెల్ పేర్కొన్నారు.

భారత 'ఎ' జట్టు కోచ్‌గా:
గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత 'ఎ' జట్టు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఎన్‌సీఏ డైరెక్టర్ అయిన ద్రవిడ్.. ఆటగాళ్లను దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ఎక్కడ లోపం ఉందో చెప్పి.. దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తాడు. గాయాల పాలైన ఆటగాళ్లు కూడా త్వరగా కోలుకోవడానికి ప్రధాన కారణం ద్రవిడే. ఇక ఐపీఎల్ కూడా టీమిండియాకు మంచి మంచి ఆటగాళ్లను ఇచ్చింది.

లంక పర్యటనకు కోచ్‌గా:
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించనుండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో భారత జట్టు (ఇండియా-బి టీమ్)ను బీసీసీఐ పంపనుంది. ప్రధాన జట్టులో చోటు దక్కని సీనియర్లు, ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో ఓ జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. కోహ్లీసేనతోనే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లబోతున్నారు. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. లంక టూర్‌కి కోచ్‌గా వ్యవహరించమని బీసీసీఐ ద్రవిడ్‌ని కోరినట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్ కూడా లంకకి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications