
హైదరాబాద్: తాత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు ఆ మనవడు. చనిపోయిన తన తాత అంచనాలను నిజం చేశాడు. తాత చనిపోయిన తర్వాత ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ మనవడు ఇంగ్లాండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మనవడి పేరు డామ్ సిబ్లే.
తాజాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ తరుపున డామ్ సిబ్లే టెస్టుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇది అతడికి నాలుగో టెస్టు కావడం విశేషం. రెండో టెస్టులో 24 ఏళ్ల డామ్ సిబ్లే 133 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఫలితంగా అతడు తన కుటుంబానికి రూ. 20.50 లక్షలు లాభం సంపాదించిపెట్టాడు. వివరాల్లోకి వెళితే... సిబ్లే తాత కెన్నెత్ మెంకెజీ తన మనవడు టీనేజ్‌లో ఉన్నప్పుడే అతడిలోని ప్రతిభను గుర్తించాడు. దీంతో ఏదో రోజు సిబ్లే దేశానికి ప్రాతినిథ్యం వహిస్తాడని ఓ బెట్టింగ్ వెబ్‌సైట్లో రెండు బెట్టింగ్‌లు (150/1, 66/1) కట్టాడు.
అప్పటికి సిబ్లీ చిన్న కుర్రాడు. గత కొన్నేళ్లలో దేశవాళీల్లో రాణించి ఇటీవలే ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు. 2011లో కెన్నెత్ మెంకెజీ మరణించాడు. ఆ బెట్టింగ్ స్లిప్పులు ఇప్పుడు బయటపడ్డాయి. బెట్టింగ్ షాప్‌లో వాటి గురించి వాకబు చేయగా నిజమేనని తేలిందని సిబ్లే తల్లి క్రీస్టీన్ తెలిపింది.
అంతేకాదు తన తండ్రి కాసిన పందెం మొత్తాన్ని తమకు ఇచ్చేందుకు ఆ బెట్టింగ్ వెబ్‌సైట్ అంగీకరించినట్టు సిబ్లే తల్లి క్రీస్టీన్ పేర్కొంది. డామ్ యొక్క సామర్థ్యాన్ని అతడి తాత చూశాడని అందుకే పందెంలో పెట్టుబడి పెట్టాడని ఆమె తెలిపింది. డామ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ఎక్కువ మక్కువని పేర్కొంది.