
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తానే గనుక టీమిండియా జట్టు సెలక్టర్ అయి ఉంటే.. భారత టెస్ట్ జట్టులో వెంటనే యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేసి ఉండేవాడినని స్పష్టం చేశాడు. చాహల్ ప్రపంచ స్థాయి బౌలర్ అని స్వాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని కూడా పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఎందుకనో ఈ అత్యుత్తమ స్పిన్నర్ ఆడటం లేదని స్వాన్ ప్రస్తావించాడు. చాహల్ టీ20, వన్డే ఫార్మాట్లకు సరిపోయినట్లు టెస్టులకు సరిపోతాడో లేడో కచ్చితంగా చెప్పలేనని స్వాన్ పేర్కొన్నాడు. ఆధునిక స్పిన్నర్లు ఫింగర్స్, శరీరం, మైండ్‌తో అధిక శ్రమ పడాల్సిన అవసరం టెస్టుల్లో ఉంటుందని అందువల్ల అంతగా ఆకర్షితులు కావడం లేదని అతను పేర్కొన్నాడు.
ఇక చాహల్ టెస్ట్ అరంగేట్రం గురించి స్వాన్ మాట్లాడుతూ.. 'నేను ముందు చాహల్‌తో కలిసి కూర్చుంటాను. అతనితో చర్చిస్తాను. చాహల్ నువ్వు టెస్టుల్లో టీమిండియా తరఫున ఆడాలనుకుంటున్నావా అని చివరగా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. అతను నేను ఆడతానని ఒక్క ముక్క చెబితే చాలు.. ఏమాత్రం మరో మాట లేకుండా అతన్ని వెంటనే టెస్ట్ జట్టులో చేర్చుకుంటాను' అని స్వాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియాతో పేర్కొన్నాడు. 'చాహల్ ప్రపంచ స్థాయి బౌలర్ అని నేను నమ్ముతున్నా. నా అభిప్రాయం ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అతను. బంతిపై అతని నియంత్రణ, చాలా గమ్మత్తైన పరిస్థితుల్లో లెగ్-స్పిన్ బౌలింగ్ చేయడం, ప్రత్యేకించి మంచు కురిసి బంతి తడి అయినప్పుడు అతను వేసే మిస్టరీ డెలివరీలు నమ్మశక్యం కావు అని స్వాన్ పేర్కొన్నాడు.
సెలెక్టర్లు స్పిన్నర్లను ఒక ఫార్మాట్‌కు సరిపోయే స్పిన్నర్ ఇతను అంటూ ఏదైనా ముద్ర వేస్తారా అని స్వాన్‌ను ప్రశ్నించగా.. అవును కచ్చితంగా ఒకట్రెండు ఫార్మాట్‌లోకి ఇతను సరిపోతాడనేలా ముద్ర వేస్తారు. ఇక ఆ ముద్రను తొలగించుకోవడం చాలా కష్టమవుతుంది. చాహల్ అత్యుత్తమ వైట్-బాల్ స్పిన్నర్ అని నేను చెప్తా.. కానీ అతను అత్యుత్తమ రెడ్-బాల్ స్పిన్నర్ (టెస్ట్ స్పిన్నర్) కాగలడో లేదో మాత్రం నేను చెప్పలేను.' అని స్వాన్ పేర్కొన్నాడు.