
జులై 1న ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్, ఇండియా జట్లు రీషెడ్యూల్డ్ 5వ టెస్టులో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టే ఫేవరెట్ అని మాజీ ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది భారత్ ఎదుర్కొన్న ఇంగ్లాండ్ జట్టుకు.. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టుకు చాలా తేడాలున్నాయి. కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎటాకింగ్ టెస్ట్ క్రికెట్‌ను ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి గేమ్.. ఇండియాకు అత్యుత్తమ సవాల్ విసిరే అవకాశముంది.
భారత జట్టు.. ఇంగ్లాండ్‌తో టెస్ట్‌కు ముందు కేవలం ఒకే ఒక్క వార్మప్ గేమ్ ఆడినందున.. వారికి తగినంత ప్రాక్టీస్ కానీ సన్నద్ధత గానీ లేవని, తద్వారా ఫేవరెట్‌గా ఇంగ్లాండ్ బరిలోకి దిగుతుందని గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లాండ్ ప్రస్తుతం చాలా మంచి పొజిషన్లో ఉంది. న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం కారణంగా ఇంగ్లాండే ఫేవరేట్ అని నేను చెబుతాను. ఇంగ్లాండ్‌లో టీమిండియా కేవలం ఒకే ఒక వార్మ్-అప్ మ్యాచ్ ఆడింది. కాబట్టి టీమిండియా అంతా దుందుడుకుగా ఏం లేదు. వారికి ఈ టెస్ట్ చాలా ప్రతికూలమైంది.' అని స్వాన్ సోనీ స్పోర్ట్స్‌తో అన్నాడు.
ఇటీవల ముగిసిన సిరీస్‌లో మాజీ కెప్టెన్ జో రూట్, ఆలీ పోప్‌ల ఫామ్‌ను స్వాన్ ప్రస్తావించాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టులో కొన్ని బలహీనతలు ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే స్పిన్నర్ జాక్ లీచ్ ఫామ్ అందుకోవడాన్ని ప్రశంసించాడు. 'టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో తలపడబోతుంది. ఇప్పుడు జో రూట్ తన అత్యుత్తమ స్థితిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆలివ్ పోప్ సైతం ఇంగ్లండ్ తరఫున బాగా రాణిస్తున్నాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ కాస్త నిరాశపర్చుతున్నా జట్టులోని మిగతా బ్యాటర్లు అందరు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ మధ్య ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న స్పిన్నర్ జాక్ లీచ్ కూడా చివరి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి మంచి జోష్‌లో ఉన్నాడు. ఇన్ని విషయాల బట్టి ఇండియాపై ఇంగ్లాండ్ పైచేయి సాధించడం ఖాయంగా కన్పిస్తుంది' అని స్వాన్ పేర్కొన్నాడు.