'అధ్యక్షుడిగా గంగూలీనే సరైనోడు.. ఈ సంక్షోభంలో ఐసీసీని దాదానే నడిపించాలి'

జొహెన్నెస్‌బర్గ్: కరోనా వైరస్ సంక్షోభం సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)నీ లీడ్ చేసేందుకు సమర్థులు కావాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే ఐసీసీ అధ్యక్షుడిగా సరైనోడు అని పేర్కొన్నాడు. ఐసీసీకి దాదా అధ్యక్షుడు కావాలని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బోర్డును గంగూలీ అద్భుతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

అధ్యక్షుడిగా గంగూలీనే సరైనోడు:
తాజాగా గ్రేమ్ స్మిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడిగా ఓ బలవంతమైన వ్యక్తి కావాలి. కరోనా వైరస్ తర్వాత క్రికెట్‌కి ఓ బలమైన నాయకుడి అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్లీ క్రికెట్‌ని మామూలు స్థితికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా సంక్షోభ సమయంలో ఐసీసీ నడపాలంటే.. ఆధునిక క్రికెట్‌తో పరిచయముండటంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలున్న గంగూలీనే సరైనోడు. గంగూలీ వంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఉత్తమం' అని స్మిత్ అన్నాడు.

ఏదో ఒక రోజు దాదా ఐసీసీకి నాయకత్వం వహిస్తాడు:
సౌరవ్ గంగూలీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఇటీవలే ప్రశంసల వర్షం కురిపించాడు. ఐసీసీని నడిపించేంత రాజకీయ నైపుణ్యం గంగూలీకి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. వరల్డ్ క్రికెట్‌లో బీసీసీఐని నడపడం అత్యంత కష్టమన్నాడు. కఠినమైన బీసీసీఐ అధ్యక్ష పదవిని ఇట్టే నిర్వహిస్తున్న గంగూలీ.. ఏదో ఒక రోజు ఐసీసీకి నాయకత్వం వహిస్తాడని గోవర్ జోస్యం చెప్పాడు. ఐసీసీ ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్ కూడా భారతీయుడే కావడం విశేషం. అయితే మే నెల తర్వాత తన పదవీకాలం ముగిసిపోనుండటంతో.. తిరిగి ఎక్స్‌టెన్షన్ కోరబోనని గతంలోనే మనోహర్ తెలిపారు.

ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు:
వెస్టిండీస్‌లో జూలైలో తమ జట్టు జరపబోయే పర్యటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని గ్రేమ్ స్మిత్ తెలిపాడు. కరోనా వైరస్ కారణంగా చాలా ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభావం పడటంతో ఈ ఆలస్యానికి కారణమని తెలిపాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక చీఫ్ డైరెక్టర్ జాక్వెస్ ఫౌల్ మాట్లాడుతూ ఆగస్టు చివరిలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వాలన్న ప్రణాళికలు కొనసాగుతున్నాయన్నాడు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఫాల్ చెప్పాడు. గంగూలీ ఐసీసీకి నాయకత్వం వహించాలని స్మిత్ చేసిన పిలుపును తాను స్వాగతిస్తున్నాన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications