
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా క్రికెట్ గణనీయంగా అభివృద్ధి చెందింది. 22ఏళ్ల వయసులోనే కెప్టెన్‌గా స్మిత్ నియమించబడ్డాడు. కెప్టెన్ అయ్యేనాటికి స్మిత్ దక్షిణాఫ్రికా తరపున కేవలం ఎనిమిది టెస్టులు, 22 వన్డేలు మాత్రమే ఆడాడు. దక్షిణాఫ్రికా జట్టుకు అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ పేరొందాడు. అతను జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన జట్లలో ఒకటిగా ఎదిగింది. బ్యాటర్‌గా కూడా స్మిత్ గొప్ప ప్రదర్శన కనబరిచాడు.
దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడిన ఈ ఎడమచేతి బ్యాటర్.. 117 టెస్టుల్లో 9,265పరుగులు చేశాడు. టెస్టుల్లో 48.25సగటును కనబరిచాడు. 197వన్డేల్లో స్మిత్ 6,989పరుగులు చేశాడు. అయితే అతని క్రికెట్ కెరీర్లో అతన్ని ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్ ఒకరున్నారు. అతనెవరో కాదు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్. అంతర్జాతీయ క్రికెట్‌లో 27సార్లు ఇరువురు తలపడగా.. జహీర్ 14సార్లు స్మిత్‌ను ఔట్ చేశాడు. క్రికెట్. కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ.. "నేను ఎదుర్కొన్న అత్యంత నైపుణ్యం కలిగిన బౌలర్లలో జహీర్ ఒకడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ బ్యాటర్లకు జహీర్ ఖాన్ ఒక కొరకరాని కొయ్య లాంటివాడు. అతను చాలా లాంగ్ స్వింగ్ చేయగలడు. పేస్‌లో మంచి వేరియేషన్ కనబర్చుతాడు. రివర్స్ స్వింగ్ బంతితో తిప్పలు పెడతాడు." అని స్మిత్ తెలిపాడు.
గ్రేమ్ స్మిత్ 2014లో తన 33వ ఏటా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ప్రస్తుతం దక్షిణాఫ్రికా మెన్స్ జాతీయ జట్టుకు క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ తరంలో గ్రేమ్ స్మిత్ పేరొన్నదగినవాడు. గిబ్స్, కలిస్, మార్క్ బౌచర్, షాన్ పొలాక్ లాంటి ఉద్ధండులైన ప్లేయర్లతో కూడిన దక్షిణాఫ్రికా జట్టుకు అతను సుదీర్ఘ కాలం కెప్టెన్సీ వహించాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలను దక్షిణాఫ్రికాకు గ్రేమ్ స్మిత్ అందించాడు. కానీ దక్షిణాఫ్రికా చిరకాల కల అయిన ప్రపంచకప్ ట్రోఫీని మాత్రం స్మిత్ తన దేశానికి అందించలేకపోయాడు. గ్రేమ్ స్మిత్ ఆటలో పలు వివాదాలను కూడా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా అత్యుత్తమ కెప్టెన్లలో స్మిత్ ముందు వరుసలో ఉంటాడని చెప్పటానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.