ఆల్‌టైమ్ క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ గూగుల్ ఘన నివాళి

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 110వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. బ్రాడ్‌మన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో కూడిన యానిమేటెడ్ ఫొటోను డూడుల్‌గా రూపొందించి ఆయనకు ఘన నివాళి అర్పించింది.
ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెట్ అభిమానులు ఆయన్ని ముద్దుగా 'ది డాన్'గా పిలుచుకుంటారు. సర్ జార్జ్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 1908, ఆగస్టు 27న ఆస్ట్రేలియాలోని కాటాముండ్రాలో జన్మించారు. 20 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.

1928 నవంబరు 30న
1928 నవంబరు 30న ఇంగ్లాండ్‌పై బ్రాడ్‌మన్ తన అరంగేట్ర మ్యాచ్‌ని ఆడాడు. 52 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్రాడ్‌మన్ 80 ఇన్నింగ్సుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలతో పాటు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 29 సెంచరీల్లో 12 డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు తొమ్మిదిసార్లు బౌలింగ్ వేసిన బ్రాడ్‌మన్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంగ్లాండ్‌పైన తన చివరి టెస్టు ఆడిన బ్రాడ్‌మన్
1948 ఆగస్టు 14న ఇంగ్లాండ్‌పైన తన చివరి టెస్టు ఆడాడు. ఇది, ఐదు టెస్టుల యాషెస్ టెస్టు సిరీస్ చివరి మ్యాచ్. ఐదు టెస్టుల సిరీస్ అప్పటికే ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 52 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు చక్కటి శుభారంబాన్ని అందించారు. 117 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన తొలి వికెట్‌ను కోల్పోయింది.

బ్రాడ్‌మన్‌కు గౌరవ సూచికంగా
ఆ తర్వాత డాన్ బ్రాడ్‌మన్ ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం వారి క్యాప్‌లను తీసి గౌరవ సూచకంగా స్వాగతం పలికారు. కెరీర్‌లో బ్రాడ్‌మన్ చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఎరిక్ హొల్లీస్ బౌలింగ్‌లో తొలి బంతి ఎదుర్కొన్న బ్రాడ్‌మన్ ఆ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ప్రేక్షకులక ఏమైందో అర్ధం కాలేదు.

తన చివరి ఇన్నింగ్స్‌లో ఇలా
ఒక్కసారిగా మైదానమంతా మూగబోయింది. తన చివరి మ్యాచ్‌లో మరో 4 పరుగులు చేస్తే టెస్టుల్లో 100 సగటు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ గుర్తింపు పొందేవాడు. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో సైతం 188 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 149 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం బ్రాడ్‌మన్‌కు రాలేదు.

యాషెస్ సిరీస్‌ల్లోనే అతడు 19 సెంచరీలు
ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌ల్లోనే అతడు 19 సెంచరీలు సాధించాడు. 1930లో జరిగిన యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ 974 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 334. 2009లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో బ్రాడ్‌మన్ చోటు దక్కించుకున్నాడు. న్యుమెనియాతో బాధపడుతూ బ్రాడ్‌మన్ 2000 డిసెంబరులో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన అతడు 92 ఏళ్ల వయసులో 2001 ఫిబ్రవరి 25న తుది శ్వాస విడిచాడు.
బ్రాడ్‌మన్ పుట్టినరోజుపై సచిన్ ఇలా
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... బ్రాడ్‌మన్ జయంతిని పురస్కరించుకుని ఓ అనుభవాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. 1998 ఆగస్టు 27న బ్రాడ్‌మన్ తన 90వ పుట్టిన రోజు నాడు తనకెంతో ఇష్టమైన ఆటగాళ్లు సచిన్, షేన్ వార్న్‌ను తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించాడట. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సచిన్ ‘20 ఏళ్లు అయ్యింది. డాన్ బ్రాడ్‌మన్‌ను కలిసి. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో ప్రత్యేకం' అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications